ఉద్యోగం పోతుందని సాఫ్ట్‌వేర్‌ యువకుడు ఆత్మహత్య

ఎంతో కష్టపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం తెచ్చుకున్నాడు అతను.. ఇంకేముందు మంచి జీతం వస్తోంది.. ఏ ఢోకా లేదనుకుని.. అయిదేళ్ల కిందట వివాహం కూడా చేసుకున్నాడు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో.. సాఫ్‌వేర్‌లో రెసిషన్‌ పిరియడ్‌ ప్రస్తుతం నడుస్తోంది. కొంచెం అటు ఇటుగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారు. పని ఒత్తిడి తీవ్రంగా పెంచేస్తున్నారు. మెడమీద కత్తి పెట్టి పనులు చేయించుకుంటున్నారు. దీంతో ఒక్కొక్కరిపై తీవ్ర పనిభారం పెరిగిపోయింది. దీంతో తన ఉద్యోగం పోతుందని ఆందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

మంచి జీతం, లగ్జరీ లైఫ్, వీకెండ్‌ పార్టీలని అంతా భావిస్తారు కానీ..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే లగ్జరీ లైఫ్, వీకెండ్‌ పార్టీలు.. పెద్ద పెద్ద ప్యాకేజీలు అని అందరూ భావిస్తుంటారు. కానీ ఇదంతా అంతా సవ్యంగా ఉన్నప్పటి మాట.. ప్రస్తుతం రెసిషన్‌ పిరియడ్‌ నడుస్తోంది. ఇటీవల కాలంలో కొన్ని కంపెనీలు అనేక మంది ఉద్యోగులను జాబ్ నుంచి తొలగిస్తున్నారనే వార్తలు వింటూనే ఉన్నాం. దీంతో ఉన్న ఉద్యోగులపై ఆయా కంపెనీలు పనిభారం పెంచేశాయి. అలా ఒత్తిడి పెంచుతూ ఉద్యోగులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు లేకపోలేదు. దీంతో అనేక మందిలో ఉద్యోగం నుంచి తొలగిస్తారనే ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అనేకమంది ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఈక్రమంలో నార్సింగీలోని పుప్పాలగూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినోద్ కుమార్ సూసైడ్‌ చేసుకున్నాడు. సంస్థ ఒత్తిడి, ఉద్యోగం పోతుందని తీవ్ర మనస్తాపంతో వినోద్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాను ఉంటున్న నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్నాడు. వినోద్ స్వస్థలం గుంటూరు జిల్లా కాగా.. గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇతనికి అయిదేళ్ల కిందటే వివాహమైంది.