NEET కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని ఆత్మహత్య
నీట్ పరీక్ష సన్నద్దతతో భాగంగా కోచింగ్ తీసుకునేందుకు వచ్చిన ఓ విద్యార్థిని హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఉన్న ఓ కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ఆమె కిందకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆ విద్యార్థిని పేరు విద్య ప్రియాంక అని ఆమెతో ఉండే స్టూడెంట్స్ చెబుతున్నారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విద్య ప్రియాంకది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆమె హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటోంది. అక్కడే హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బిల్డింగ్ నాలుగో ఫ్లోర్‌కి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమెకు అంతటి కష్టం ఏమెచ్చింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్యకు ముందు ఆమె ఓ లెటర్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అందులోని సమాచారాన్ని మాత్రం వారు గోప్యంగా ఉంచారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం స్పందించింది. విద్యార్థిని ఆత్మహత్యకు తమకు ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.