‘జై భీమ్​’ లాంటి సినిమా రూపొందిస్తా

సినిమాల పరంగా పోటీ ఉన్నా వ్యక్తిగతంగా చాలా స్నేహంగా ఉంటారు మన టాలీవుడ్​ హీరోలు. ఇప్పటికే చాలామంది హీరోలు మల్టీస్టారర్​ సినిమాల్లో నటించడంతోపాటు, మరో హీరో మూవీ రిలీజ్​ ఫంక్షన్లలో పాల్గొని వారి మధ్య స్నేహాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా వారివారి సినిమాల ప్రమోషన్స్​లో భాగంగా ఇద్దరు టాప్​ హీరోలను ఒకే ఫ్రేమ్​లో చూసే అవకాశం వచ్చింది. ఇద్దరూ ఎలాంటి బ్యాగ్రౌండ్​ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్​ హీరోలుగా ఎదిగిన వారవడంతో ఈ చిట్​చాట్​పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు అభిమానులు. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. చిన్నచిన్న పాత్రలతో కెరీర్​ ప్రారంభించి స్టార్​ హీరోగా ఎదిగిన మాస్​ మహారాజ రవితేజ, అసిస్టెంట్​ డైరెక్టర్​గా వచ్చి మినిమమ్​ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నేచురల్​ స్టార్​ నాని.

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా సినిమా ‘దసరా’. శ్రీకాంత్​ ఓదెల దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో చాలా హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, మార్చి 30వ తేదీన దసరా చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకు తగినట్లుగానే పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజతో సరదాగా ముచ్చటించాడు నాని. రవితేజ రావణాసుర సినిమా ఏప్రిల్ 7న అంటే నాని దసరా సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత విడుదల కానుంది. దీంతో వీరిద్దరు కలిసి వారి సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు.

తెలంగాణలోని కోల్​మైన్స్​ బ్యాగ్రాప్​తో తెరకెక్కిన ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు దసరా టీమ్ అదిరిపోయే ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మాస్ రాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని చిట్​చాట్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన కెరీర్​ ప్రారంభం నుంచి తను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను పంచుకున్నారు మాస్​మహరాజ రవితేజ. ఈ సందర్భంగా రావణాసుర సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు చాలా సంగతులను పంచుకున్నారు. ఇక, నాని దసరా మూవీ సంగతులతోపాటు ప్రొడక్షన్​ హౌజ్​ గురించి ముచ్చటించారు రవితేజ. ఈ నేపథ్యంలో నాని ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన బ్యానర్​ వాల్​పోస్టర్​ సినిమాస్​ గురించి మాట్లాడుతూ.. ‘చాలా సినిమాలు చేస్తున్నాను. ఒక తృప్తి కోసం మాత్రమే సినిమాలు నిర్మిస్తున్నాను. మీతో సినిమా చెయ్యాలని ఉంది. అందులోనూ ‘జై భీమ్​’లాంటి ఓ మంచి సినిమా తీస్తే ఒక ప్రొడ్యూసర్​గా గర్వంగా ఫీలవుతా’ అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు నాని.

అంతేకాదు ఇప్పటివరకు తను పోలీస్​ బ్యాగ్రాప్​లో వచ్చే కథల్ని ఎంచుకోలేదని, ఒకవేళ చేస్తే విక్రమ్​ రాథోడ్​ వంటి పవర్​ఫుల్​ క్యారెక్టర్​ చేస్తానన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడులో రవితేజ విక్రమ్​ రాథోడ్​గా పోలీస్​ ఆఫీసర్​ పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక, దసరా మూవీలో నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.