Crime News: యాక్సిడెంట్ అన్నారు.. సీసీటీవీ చూస్తే మర్డర్..!
Crime News: కర్ణాటక రాజధాని బెంగళూరులో (banglore) దారుణం చోటుచేసుకుంది. ఓ 77 ఏళ్ల వృద్ధుడు యాక్సిడెంట్‌లో చనిపోయాడని అనుకుంటే.. అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. వివరాల్లోకెళితే.. బెంగళూరుకు చెందిన కృష్ణప్ప అనే వృద్ధుడు నవంబర్ 16న తన స్కూటర్‌పై మందులు తెచ్చుకోవడానికి వెళ్లారు. మెడికల్ షాప్ ముందు తన స్కూటర్ పార్క్ చేసి మందులు తెచ్చుకుని వచ్చే సరికి ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి కృష్ణప్ప స్కూటర్‌ను ఢీకొడుతూ కనిపించాడు. దాంతో కృష్ణప్ప అతనిపై కేకలు వేసాడు.
దాంతో ఆ వ్యక్తి కృష్ణప్పపై రాయి విసిరి పారిపోయాడు. కృష్ణప్ప రక్తపు మడుగులలో పడి ఉండటం గమనించి స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆ వ్యక్తి కృష్ణప్పను రాయితో కొట్టినప్పుడు ఎవ్వరూ చూడలేదు. దాంతో యాక్సిడెంట్ అయ్యిందని అంతా అనుకున్నారు. కృష్ణప్ప హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు.
పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకున్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా పోలీసులు షాకయ్యారు. నిందితుడు పార్క్ చేసి ఉన్న బైక్ దొంగలించి పారిపోతున్న సమయంలో కృష్ణప్ప స్కూటర్ అడ్డుగా ఉండటంతో తన్నడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత నిందితుడితో కృష్ణప్ప గొడవ పడటం అతను రాయితో కొట్టి పారిపోవడం అంతా పోలీసులు చూసారు. ఫుటేజ్ ఆధారంగా నిందితుడు సర్ఫరాజ్ ఖాన్ అనే బైకుల దొంగగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులు కృష్ణప్ప కొడుకుని పిలిచి చెప్పగా తన తండ్రి హత్యకు గురయ్యాడని తెలుసుకుని అతను స్టేషన్‌లోనే రోదించాడు.