గుండె పోటుతో 19ఏళ్ల యువకుడు మృతి
వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో గుండె పోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. అయితే దీనికి గల కారణాలు మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ మధ్య కాలంలో చిన్నారుల నుంచి యువకులు.. పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈనేపథ్యలో ఎప్పుడు.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనంటూ అందరూ భయాందోళనలకు గురికావల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఏన్కూరు మండలం రేపల్లే వాడలో ఉంటున్న డిగ్రీ చదవుతున్న విద్యార్థి గుండెపోటుతో చనిపోవడం ఆందోళన రేపుతోంది. రేపల్లెవాడకు చెందిన షేక్ ఖాసీం పాషా (19) డిగ్రీ చదవుతున్నాడు. ఖమ్మం నగరంలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోజూ ఆరోగ్యంగా ఉండే.. ఖాసీంపాషా.. బుధవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలడంతో.. బంధువులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఖాశీం మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కార్డియాక్ అరెస్టు మృతికి కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక బంధువులు మృతదేహాన్ని రేపల్లెవాడకు తరలించారు. ఖాసీంపాషా తండ్రి నాగులమీరా కార్పెంటర్‌గా, తల్లి మైబూబీ కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నారు. చదువుకోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు.