ఇవాళ ఒక్కరోజే 2,151 కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,151 కొత్త కేసులు నమోదు కాగా, గత అయిదు నెలల్లో ఈ స్థాయిలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. ఇక దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 11,903 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది. తాజాగా ఏడుగురి మృతి చెందారని తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,848కి పెరిగింది. మహారాష్ట్రలో ముగ్గురు, కర్నాటక, కేరళలో ఒక్కొకరు వైరస్ బారిన పడి చనిపోయారని అధికారులు చెబుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉందని.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 శాతంగా నమోదవుతుందని అంటున్నారు. అయితే రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తెలంగాణలో వెలుగుచూస్తున్న కేసులు..
కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నిలకడగా ఉంటున్నాయి. వైద్యారోగ్యశాఖ అంచనాల మేరకు మార్చి మొదటి, రెండు వారాల్లో పెరిగిన కేసులు క్రమేణా తగ్గుతున్నట్టు గుర్తించారు. అయితే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 కేసులు నమోదయ్యాయి. అవి కూడా 20 జిల్లాల్లో వెలుగు చూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం, ఇతర కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం రెండు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం అర్బన్‌లో ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు తెలిసింది. ఇటీవల సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ గర్భిణి వైద్య సేవల కోసం రాగా ఆమెకు కొవిడ్ ఉన్నట్టు తేలిందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయటికి వస్తే తప్పనిసరిగా మాస్సులు ధరించాలని సూచిస్తున్నారు.