వయసు 103.. ఇప్పటికీ జిమ్‌లో ఇరగదీస్తున్న బామ్మ!
ఇప్పుడున్న లైఫ్‌స్టైల్ కారణంగా చిన్నవయసులోనే నాలుగు అడుగులు వేయగానే అలసిపోతున్నారు. కొందరేమో చక్కని శరీరాకృతి కావాలని ఆరాటపడుతుంటారు కానీ అందుకు అవసరమైన కసరత్తులు మాత్రం చేయరు. ఇంకొందరైతే రేపటి నుంచి జిమ్‌కి వెళ్లి ఇరగదీసేస్తా అంటూ మెంబర్‌షిప్స్‌కి డబ్బులు కడతారు కానీ జిమ్‌కి మాత్రం వెళ్లరు. కానీ పై ఫోటోలో కనిపిస్తున్న బామ్మగారు మాత్రం ఇప్పటికీ జిమ్‌లో కసరత్తులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఎందుకంటే ఆమె వయసు 103 సంవత్సరాలు. ఈ వయసులోనూ క్రమం తప్పకుండా జిమ్ చేస్తుంటారట. ఇంతకీ ఈ బామ్మగారి కథేంటంటే…
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన థెరిస్సా మూర్ అనే బామ్మకు ఇప్పటికీ ఎక్సర్‌సైజ్ చేయడం అంటే ఆసక్తి. ఆమెను చూస్తే అడుగు తీసి అడుగు వేయగలరా అనుకుంటారు కానీ రోజూ ముఖానికి చక్కగా మేకప్ వేసుకుని, మెడలో గొలుసులు వేసుకుని టిప్‌టాప్‌గా తయారై తన ఇంటి పక్కన ఉన్న జిమ్‌కి వెళ్లి వస్తుంటుంది. సైక్లింగ్ చేయడంతో పాటు వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయడం చూసి జిమ్‌కి వచ్చేవాళ్లు కూడా షాకవుతుంటారట. థెరిస్సా ఇటలీలో పుట్టారు. ఆమె 1946లో ఓ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్నారు. దాంతో చాలా దేశాల్లో నివసించారు. చివరికి కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. వర్కవుట్ చేస్తే తనకు తెలీనంత శక్తి వస్తుందని థెరిస్సా అంటున్నారు. ఇంట్లో ఉండటం కంటే జిమ్‌లో ఉంటేనే తన తల్లి ఎంతో సంతోషంగా ఉంటారని థెరిస్సా కూతురు తెలిపారు. వయసు పెరిగినంత మాత్రాన ఇంట్లో ఓ మూల కూర్చుని పెట్టింది తిని పడుకోవడం తగదని, ఏ వయసులోనైనా ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత ఎక్సర్‌సైజ్ చేస్తుండాలని థెరిస్సా సలహా ఇస్తున్నారు.