నిజంగానే మర్చిపోయారా.. పవన్ కల్యాణ్ లేఖలో కనపడని ఎన్టీఆర్ పేరు!

RRR సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఎల్లలు దాటింది. పాన్ ఇండియా హీరోగా సత్తా చాటిన చెర్రీ.. ఇప్పుడు విదేశాల్లో సందడి చేస్తూ తన స్టామినా ప్రూవ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా అమెరికా వెళ్లి అక్కడి అంతర్జాతీయ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు రామ్ చరణ్.  హాలీవుడ్  సినిమాకు అవార్డ్ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.  హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కి పురస్కారాలు దక్కడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘనత సాధించిన రామ్ చరణ్‌కు.. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ కొల్లగొడుతున్న అవార్డుల నిమిత్తం దర్శకుడు రాజమౌళికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. తాజాగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు. అయితే అందులో జూనియర్​ ఎన్టీఆర్​ పేరు లేకపోవడం పలు వాదనలకు దారితీస్తోంది.

పవన్​ విడుదల చేసిన లేఖలో.. ‘ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డులలో ‘RRR’ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ అవార్డ్‌ను రామ్ చరణ్ ప్రకటించడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్‌కీ, దర్శకులు రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్‌ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక అబ్బాయ్‌కి బాబాయ్ అభినందనలు తెలపడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా వారిద్దరి గురించే మాట్లాడుకుంటుండటం విశేషం. ‘అబ్బాయ్‌కి బాబాయ్ అభినందలు’ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి సందడి చేస్తున్నారు.

అయితే, పవన్​ కల్యాణ్​ అభినందన లేఖలో ఎక్కడా జూనియర్​ ఎన్టీఆర్​ పేరు కనిపించకపోడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సినిమాలో రామ్​చరణ్​, ఎన్టీఆర్ పోటాపోటీ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒకరకంగా కొమరం భీంగా ఎన్టీఆర్​ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. ఆర్​ఆర్​ఆర్​ విజయంలో ఎన్టీఆర్​ పాత్ర చాలా కీలకమైనది. కానీ పవన్​ కల్యాణ్​ ఎక్కడా ఎన్టీఆర్​ పేరు ప్రస్తావించకపోవడం చర్చకు దారి తీస్తోంది.  ఎన్టీఆర్​ అభిమానులు సోషల్​ మీడియా వేదికగా ఈ విషయంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ​

శుక్రవారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో నిర్వహించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఫిల్మ్ అవార్డులలో ‘RRR’ సినిమా నాలుగు అవార్డులు దక్కించుకుంది. ఈ వేడుకలో రామ్ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించి ఉత్తమ వాయిస్, మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మెన్స్ విభాగంలో విజేతలను ప్రకటించడం విశేషం. కాగా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును చరణ్, రాజమౌళి కలిసి సంయుక్తంగా అందుకున్నారు. అలాగే, ఉత్తమ స్టంట్స్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లోనూ పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్  సాంగ్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్ అవార్డులను రాజమౌళి అందుకున్నారు.