ఏపీలో రాజకీయాలు దిగజారిపోయాయి:మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్న కుటుంబ పార్టీల వల్ల ప్రజలు నష్టపోతున్నారని ఈ విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ప్రధాని మోదీ కూడా అందుకు కట్టుబడి ఉన్నారన్నారు. ఈ నెల 13న ఉత్తరాంధ్రా జిల్లాల్లో నిర్వహించనున్న పట్టభద్రలు ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ఎక్కువగా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. అయితే.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంపై విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. అనంతరం పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ మద్దతులో నిలబడుతున్న పీవీ మాధవ్‌ను ఉద్యోగులు, యువకులు గెలిపించుకోవాలని మంత్రి కిషన్ రెడ్డి కోరారు. మాధవ్ వంటి వారు గెలిస్తే.. ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు.
ఏపీలో బీజేపీ పాగా..
తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్‌తో ఏపీలో బీజేపీ పాగా వేయాలనుకుంటోందన్న సంకేతాలు స్పష్టమవుతున్నయి. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంతమంది చట్ట సభల్లో అడుగు పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. గతంలో ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చిన సమయంలో కూడా ఇదే విషయాన్ని ఏపీ నాయకత్వానికి సూచించినట్లు పలువురు నాయకులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా పుంజుకుంటున్న బీజేపీ ఏపీలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. తెలంగాణతో పాటు, ఏపీలో అధికారం చేపట్టాలని చూస్తున్నట్లు .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజా కామెంట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆలయాలను అభివృద్ది చేయడానికి కేంద్రం కృషి చేస్తుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పర్యాటక, రైల్వే రంగాలకు కేంద్రం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా అరకు ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు ప్రధాని మోదీ గట్టి సంకల్పంతో ఉన్నారన్నారు. ఏపీని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటుందని తెలిపారు.