ప్రీతి పొత్తికడుపులో గాయం.. ఆమెది హత్యే – సోదరుడి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్యురాలు ప్రీతి మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా.. ఎవరైనా హత్య చేశారా అన్నది ఇంకా సస్పన్స్‌గానే ఉంది. ఇది ఇలా ఉండగా.. ప్రీతిని వేధించిన సీనియర్‌ విద్యార్థిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరోవైపు కేఎంసీలో అనస్థీషియా హెచ్ ఓ డి నాగార్జున రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆయన్ని సస్పెండ్‌ చేసి.. భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతిపై వేధింపులు చేస్తున్న క్రమంలో సైఫ్ గురించి హెచ్‌వోడీకి ఫిర్యాదు చేసినా.. ఆయన పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. హెచ్‌వోడీ సైఫ్‌ను మందలించి ఉంటే.. ప్రీతి బతికి ఉండేదని పలువురు చెబుతున్నారు.

ప్రీతిది హత్యే..
ప్రీతి సోదరుడు పృథ్వి మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించారు. నిమ్స్ వైద్యులు ప్రీతీకి అందించిన చికిత్సపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రీతిది ఆత్మహత్య కాదని .. హత్యేనని సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి పొత్తికడుపు వద్ద సర్జరీ చేశారని, ఆ సర్జరీ ఎందుకు చేశారో కూడా ఇప్పటివరకు తెలియలేదని అతను పేర్కొన్నారు. ప్రీతికి చేతిపై కూడా గాయం ఉందని, ఆమె శరీరంలోని రక్తాన్ని డయాలసిస్ ఎందుకు చేశారో వైద్యులు చెప్పారని అతను డిమాండ్‌ చేశారు. పోస్టుమార్టంలో మత్తు ఇంజక్షన్ గురించి ఏ విధంగా తెలుస్తుందని ప్రశ్నించారు.

వరంగల్‌లో విచారణ…
సైఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వరంగల్ పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం జైలు నుంచి వరంగల్ మటవాడ పోలీస్ స్టేషన్ కు అతన్ని తీసుకొచ్చి పోలీసులు విచారణ ప్రారంభించారు. దాదాపు 6 గంటలపాటు మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో సైఫ్ ను విచారించారు. ఈ విచారణలో వరంగల్‌ సీపీ రంగనాథ్‌ పాల్గొని పర్యవేక్షించారు. సైఫ్‌ సెల్‌ఫోన్‌ను ఇప్పటికే పోలీసులు తీసుకుని కొంత డేటా తీసుకున్నారు. దీని ఆధారంగా అతన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రీతి, సైఫ్ మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? సైఫ్ ప్రీతిని వేధించాలని ఎందుకు ప్రయత్నించాడు. తోటి మెడికోలతో ప్రీతి గురించి ఎందుకు చెప్పాడు అనే అంశాలతోపాటు వాట్సప్ చాటింగ్ పై కూడా సైఫ్ ను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. ఇక ఇవాళ కూడా సైఫ్ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్‌ చెప్పిన విషయాలతోపాటు.. టెక్నికల్ ఎవిడెన్స్ ల పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈక్రమంలో తనకు బెయిల్‌ కావాలంటూ ఫిబ్రవరి 28న సైఫ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఇంతవరకు కోర్టు విచారణ జరపలేదు. మరో నాలుగు రోజుల పాటు సైఫ్ పోలీసు కస్టడీలో ఉండనున్నారు.