పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా – చంద్రబాబు ఫైర్
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి లీగల్ సెల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత నాలుగేళ్లల్లో టీడీపీ శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలు.. కానీ ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి సాయం తీసుకున్నారని చంద్రబాబు తెలిపారు. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసం సాయం చేసిందన్నారు. పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నానని.. అధికార పార్టీకి సహకరించే పోలీసులు, అధికారులు తప్పుడు పనులకు సహకరించవద్దని ఆయన సూచించారు. తాను అధికారంలోకి వచ్చిన మరు క్షణమే.. ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులను బోనెక్కిస్తానని సవాల్ విసిరారు. సైకో నాయకుడు అనేకమంది సైకోలను తయారు చేశారని విమర్శించారు. జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్‌కు రాష్ట్రం అడ్డాగా మారిందని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వానికి లాయర్ల అవసరం ఉంటుందని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ లీగల్ సెల్ టీం సేవలు వినియోగించుకుంటామని చంద్రబాబు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల గురించి బాబు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలని.. ఈ ఓటమితో వైసీపీ పతనం ప్రారంభమవ్వాలని శ్రేణులకు సూచించారు. డెకాయిట్లు రాజకీయాల్లో ఉండకూడదంటే.. వచ్చే ఎన్నికల్ని సీరియస్సుగా తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్ సేవలు పటిష్టంగా వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్బంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అనుసరించవలసిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల వేధింపులకు గురైన టీడీపీ బాధిత కుటుంబాలతో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతల దాడుల్లో వారు పడ్డ ఇబ్బందులను బాబుకు వివరించారు.