గ్రూప్-1 అభ్యర్థులకు షాక్.. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసిన TSPSC
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షతోపాటు, డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అనంతరం వాటిని నిర్వహించనున్న పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో ఇప్పటికే అయిదు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలతోపాటు, మరో రెండు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా అతని వద్ద ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారని సమాచారం. అవే కాకుండా.. ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్ ఎగ్జామ్ పేపర్లు కూడా అతడి పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు తెలియవస్తోంది. దీంతోపాటు ప్రవీణ్ గత ఏడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. అందులో అతనికి 103 మార్కులు వచ్చాయి. ఈక్రమంలో గ్రూప్-1 పరీక్ష పేపర్ కూడా ఇతనికి ముందే తెలిసినట్టు భావించిన అధికారులు ఆ కోణంలో కూడా దర్యప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో ఆ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఎంతో మంది అభ్యర్థులు మెయిన్స్‌కు సన్నద్దం అవుతున్న తరుణంలో మరోసారి ప్రిలిమ్స్ పరీక్ష రాయాల్సి రావడం కొంత ఇబ్బందికరమని చెప్పవచ్చు.
రద్దైన పరీక్షలు ఎప్పుడంటే..
గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని కూడా రద్దు చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. వీటికి త్వరలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మార్చి 5న నిర్వహించిన ఏఈ పరీక్షను ముందే రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను కూడా వాయిదా వేసినట్టు ఇప్పటికే కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో జరగాల్సిన పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. వీటి కోసం కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.