Womens Day: తెలంగాణ ఆడబిడ్డలకు గుడ్‌న్యూస్!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు కానుక ప్రకటించింది. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.250 కోట్ల వడ్డీలేని రుణాల నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేస్తామన్నారు. మొత్తంగా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.750 కోట్ల వడ్డీ లేని రుణం (వీఎల్ఆర్) నిధులను సోమవారం విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించి వారి కుటుంబానికి ఆసరాగా ఉండటంతోపాటు మరి కొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు తీసుకొన్న రుణాలకు అయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. మహిళలు బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తే ఆ మొత్తాన్ని ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ప్రభుత్వం ఇస్తుంది.
ఈ సందర్భంగా పురపాలక మంత్రి కేటీఆర్ స్వయంగా పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల కోసం రూ.250 కోట్ల వడ్డీలేని రుణాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం తరపున వెల్లడించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ నిధులు అందనున్నట్టు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వడ్డీలేని రుణాల బకాయిలను విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల్లోని సభ్యులు అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, తిరిగి చెల్లిస్తున్నారని ప్రశంసించారు.
అంతేకాదు, రుణాల చెల్లింపులో తెలంగాణ మహిళలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని కొనియాడారు కేటీఆర్. రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలికల్లో 1.77 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, అందులో దాదాపు 18 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారని, వీరందరికీ ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ లేని రుణాల నిధులు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటివరకూ తెలంగాణ సర్కారు స్వయం సహాయక సంఘాలకు సుమారు రూ.15,895 కోట్లను రుణాల లింకేజీ రూపంలో అందించిందని వెల్లడించారు. మహిళా సంఘాల తరఫున ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కారు వడ్డీ లేని రుణం (వీఎల్ఆర్) విడుదల చేసి మహిళలకు గొప్ప కానుక ఇచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడపడచులకు ఇది నిజంగా మంచి కానుక అని కొనియాడారు.