దిల్లీలో వైఎస్ షర్మిల అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని.. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. అనంతరం పార్లమెంట్ వైపు ఆ పార్టీ శ్రేణులు నడుచుకుంటూ వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకుని షర్మిలను అరెస్టు చేశారు. ఈక్రమంలో ఆ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని తోపులాట వరకు వెళ్లింది. ఈనేపథ్యంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల్లో కేసీఆర్ చేసిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి వైఎస్ షర్మిల, పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
ప్రజల సొమ్ము కేసీఆర్ దోచుకున్నారు..
ప్రజల సొమ్ము కాజేసేందుకు కేసీఆర్ కుటుంబం పూనుకుందని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సుమారు 38 వేల కోట్లతో కాళేశ్వరం పూర్తవుతుందని.. కానీ రివర్స్ టెండర్ల పేరుతో లక్షా 50 వేల కోట్లకు ఎస్టిమేషన్ పెంచారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణ వ్యయంతో చిన్న చిన్న ప్రాజెక్టులు పది నిర్మించవచ్చని ఆమె పేర్కొన్నారు. మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంచారని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశప్రజల సొమ్ము లక్ష కోట్ల కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో భారీ అవినీతి జరిగిందని వ్యాఖ్యలు చేశారు.