Shanmukh: అన్న ప్రేమ‌లో.. తమ్ముడు డ్ర‌గ్స్ మ‌త్తులో..!

Shanmukh: బిగ్‌బాస్ (BiggBoss) ఫేం షణ్మకు జస్వంత్ గంజాయితో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అతడి ఫ్లాట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. గంజాయి, డ్రగ్స్ లభించాయి. అతడి అన్న కోసం పోలీసులు వెళ్లగా.. విచిత్రంగా షణ్ముక్ ఇంట్లో గంజాయి దొరికినట్లు తెలిసింది.

బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ గంజాయితో పట్టుబడినట్లు తెలిసింది. ఓ కేసులో పోలీసులు అతడి అన్న సంపత్ వినయ్‌ (Sampath Vinay)ను పట్టుకోవటం కోసం వెళితే.. ఊహించని విధంగా షణ్ముక్ గంజాయితో చిక్కినట్లు సమాచారం. షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్‌కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా.. అక్కడ గంజాయి, డ్రగ్స్ లభించాయి. దీంతో అన్నదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌కు వైజాగ్‌కు చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం నిశ్చితార్ధం అయింది. సదరు యువతి డాక్టర్ కాగా.. ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడ్డారు. తల్లికి ట్రీట్‌మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా.. మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. (shanmukh)

మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తనతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా.. మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాద్‌లోని తమ్ముడు షణ్ముక్ ఫ్లాట్‌లో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అక్కడకు వెళ్లారు.

పోలీసులు షణ్ముక్ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించగా.. డ్రగ్స్‌తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. షణ్ముక్ అన్న సంపత్ వినయ్ వద్ద 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పాలీసులు సంపత్ వియత్‌తోపాటు షణ్ముక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనే గంజాయి దొరకటంతో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. గతంలోనూ షణ్ముక్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. హైదరాబాద్‌లో అతివేగంగా కారును నడిపి మూడు వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలటంతో లక్కీగా తప్పించుకున్నాడు.

నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కడం షణ్ముఖ్ కు కామన్ అయ్యింది. యూట్యూబ్ వేదికగా పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జశ్వంత్. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించాడు. కానీ, నిత్యం వివాదాల్లో చిక్కడం పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గంజాయి సేవించే షణ్ముఖ్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మరిన్ని తప్పులు చేసే అవకాశం ఉందంటున్నారు. డ్రగ్స్, గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు ఉక్కుపాదం మోపుతుండగా.. షణ్ముక్ ఇంట్లో గంజాయి దొరకటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.