Anchor Suma: ఇక షోలు మానేస్తున్నారా?
Anchor Suma: సమయం, సందర్భం ఏదైనా సరే తన వాక్ఛాతుర్యంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే యాంకర్ సుమ కనకాల (Suma Kanakala). చాలా మంది యాంకర్లు వస్తుంటారు పోతుంటారు. కానీ ఎంత మంది వచ్చినా సుమను బీట్ చేసేవారు లేరు. తెలుగు వచ్చీ రాక పొట్టి పొట్టి దుస్తులు వేసుకునే యాంకర్ల కంటే చక్కగా లంగావోణీలు, చీరలు కట్టుకుని అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడే సుమకు ఇప్పటికీ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ ఉన్నా కూడా వారానికి ఒకటి రెండు ఈవెంట్లలో కనిపించే సుమ ఇప్పుడు నెలకు ఒకసారి కూడా ఏ ఈవెంట్‌లోనూ కనిపించడంలేదు. దాంతో సుమ ఈవెంట్లకు యాంకరింగ్ చేయడం మానేస్తున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడంలో మాత్రం సుమ ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉంటున్నారు. కానీ ఈవెంట్లకు మాత్రం ఇది వరకు వచ్చినట్లు రావడంలేదు.
దీనికి కారణమేంటో సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల (Rajiv Kanakala) వెల్లడించారు. యాంకరింగ్, నటన అనేవి ప్రభుత్వ ఉద్యోగాలు కావని.. ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా ట్రెండ్ అవుతూ ప్రేక్షకులకు కనిపిస్తూ ఉండాలని రాజీవ్ అన్నారు. అయితే ఇప్పుడు సుమ కొత్త యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి తన పిల్లలను కూడా ఇంట్రడ్యూస్ చేసారు. పిల్లలతో కలిసి సరికొత్త వీడియోలు చేస్తున్నారు. అందుకే ఆమె ఈవెంట్లకు దూరంగా ఉంటున్నట్లు రాజీవ్ తెలిపారు.
“” మాది ప్రభుత్వ ఉద్యోగం కాదు. మా కెరీర్లు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం కష్టం. ఉన్నట్టుండి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం. అలాంటి సమయంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడం, కుటుంబాన్ని సంరక్షించుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. నేను సుమను పెళ్లి చేసుకున్నాకే జీవితంలో ఆర్థికంగా చాలా స్థిరపడ్డాను. ఇద్దరం పగలు రాత్రిళ్లు కష్టపడి మాకున్న అప్పులన్నీ తీర్చేసుకుని మాకంటూ కొన్ని ఆస్తులను సంపాదించుకున్నాం. ఎంత బిజీగా ఉన్నా సుమ ఎప్పుడూ కూడా నన్ను, పిల్లల్ని పట్టించుకోకుండా లేదు. రోజూ మా కోసం సాయంత్రం 6 గంటలకే అన్ని షోలు ముగించేసుకుని ఇంటికి వచ్చేసేది. పిల్లలకు ఏం కావాలో దగ్గరుండి చూసుకునేది“” అని తెలిపారు. మొత్తానికి పిల్లల కోసమే సుమ టీవీ షోలు, ఈవెంట్లలో కనిపించడం మానేసారని తెలుస్తోంది.
ఇక సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) బబుల్‌గమ్ (Babul Gum) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ అతను తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రోషన్‌ను చూస్తుంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కుర్రాడిలా అస్సలు అనిపించడంలేదని ఎన్నో సినిమాలు చేసినవాడిలాగానే కనిపిస్తున్నాడని ఓ సందర్భంగా ప్రముఖ నటుడు విశ్వక్ సేన్ అన్నారు. ఇక రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసాడు కాబట్టి కాస్త తాను సైడ్ అయిపోతే తన బిడ్డకు దక్కాల్సిన పాపులారిటీ అవకాశాలు వస్తాయని సుమ భావించినట్లున్నారు. ఏదేమైనప్పటికీ సుమ అక్క అని ప్రేమగా పిలుచుకునే ప్రేక్షకులు సుమను బుల్లితెరపై మిస్సవుతున్నారు.