John Cena: ఆస్కార్స్‌లో న‌గ్నంగా జాన్ సెనా.. ఎందుకు?

John Cena: 96వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో నేడు ఎంతో వైభ‌వంగా జ‌రిగాయి. ఈ సారి జ‌రిగిన ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్ చిత్రాలు ఎక్కువ అవార్డులు సొంతం చేసుకున్నాయి. అయితే, ఈ అవార్డుల్లో హాలీవుడ్ న‌టుడు న‌గ్నంగా వేదిక‌పైకి వ‌చ్చి అక్క‌డున్న‌వారంద‌ర‌నీ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

పాపులర్ అమెరికన్ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఈ ఫేమ్ జాన్‌సీనా గురించి ఇండియన్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు చాలామంది తమ చిన్నతనంలో అతని రెజ్లింగ్ షోలు చూస్తూ పెరిగిన వారే. అయితే, జాన్‌సీనా ఆస్కార్ వేడుక‌ల్లో హాల్‌చ‌ల్ చేశారు. ఆస్కార్ వేదిక‌పైకి ఆయ‌న న‌గ్నంగా వ‌చ్చి అంద‌రినీ విస్మయానికి గురిచేశారు. న‌టుడు జాన్‌సీనాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇండియాలో కూడా జాన్‌సీనకు అభిమానులు ఉన్నారు. జాన్‌సీన కూడా నటుడిగా కొన్ని యాక్షన్ సినిమాల్లో కూడా న‌టించారు.

అయితే, నేడు జరిగిన ఆస్కార్ వేడుకలకు జాన్‌సీన కూడా విచ్చేసారు. అయితే ఆయ‌న‌ను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించడానికి స్టేజీపైకి ఆహ్వానించారు. దీంతో జాన్‌సీన ఒంటిమీద ఏమి లేకుండా నగ్నంగా స్టేజీపైకి వ‌చ్చారు. ఆయ‌న కేవలం ముందు వైపు ప్రైవేట్ పార్ట్ వద్ద ఓ అవార్డులు ప్ర‌క‌టించే ఎన్వ‌ల‌ప్ క‌వ‌ర్‌ను అడ్డుగా పెట్టుకొని వేదిక‌పైకి వ‌చ్చారు.

అయితే, 1974లో జరిగిన ఆస్కార్‌ వేడుకలో ఒక పురుషుడు నగ్నంగా వేదికపైకి హఠాత్తుగా పరిగెత్తుకొచ్చాడు.. అప్పట్లో అది సంచలనంగా మారింది. కానీ, 50 ఏళ్ల తర్వాత 2024కు వచ్చే సరికి అనౌన్సరే నగ్నంగా వేదికపైకి వచ్చాడు. నేటి ఆస్కార్‌ వేడుకలకు జిమ్మీ కిమ్మెల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆయన మాట్లాడుతూ 1974 ఘటనను వివరిస్తూ.. ‘‘నాడు డేవిడ్‌ నివ్విన్‌ వేదికపైకి ఎలిజిబెత్‌ టేలర్‌ను ఆహ్వానిస్తుండగా.. ఓ పురుషుడు నగ్నంగా వేదికపై పరిగెత్తాడు. ఈ రోజు ఎవరైనా న్యూడ్‌మెన్‌ వేదికపైకి వస్తే ఎలా ఉంటుందో ఊహించారా..? పిచ్చితనంగా అనిపించదా..?’’ అని ప్రశ్నించాడు. ఇంతలో వేదిక వెనక నుంచి జాన్‌ సీనా మాటలు వినిపించాయి. దీనికి స్పందించిన జిమ్మీ ‘‘అదే పనిలో ఉన్నాను’’ అంటూ సమాధానం ఇచ్చాడు.

తనకు వేదికపైకి నగ్నంగా రావడం ఇష్టంలేదని చెప్పిన సీనా.. పురుషుడి శరీరం జోక్‌ కాదని వ్యాఖ్యానించాడు. కొద్దిసేపు అతడితో వాదించిన జిమ్మీ సరే అవార్డు ఇవ్వు అంటూ ఓ ఎన్వలప్‌ను అతడి చేతిలో పెట్టి వేదిక వెనక్కి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత‌ జాన్‌సీన మైక్ వద్దకు వచ్చి కాస్ట్యూమ్స్ అందుకే ఎంతో ముఖ్య‌మ‌ని చెప్పడంతో అందరూ ఘెల్లున నవ్వేశారు. మైకు ముందుకొచ్చి ఆ ఎన్వలప్‌ను తాను ఓపెన్‌ చేయలేనని చెప్పాడు. దీంతో సాయం చేసేందుకు జిమ్మీ అక్కడికి వచ్చి నామినేషన్లను ప్రకటించారు. వాటికి సంబంధించిన క్లిప్స్‌ ప్రదర్శిస్తున్న సమయంలో వేదికపై లైట్లు ఆర్పేశారు. కొందరు సహాయకులు వేగంగా అక్కడకు చేరుకొని జాన్‌సీనాకు దుస్తులు తొడిగారు. ఆ తర్వాత ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ అవార్డును ప్రకటించారు. ఇక ఈసారి పురస్కారంలో ఎక్కువ ఆస్కార్‌లు అందుకున్న సినిమాలుగా.. ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్ చిత్రాలు నిలిచాయి. ఓపెన్ హైమర్ 7 క్యాటగిరీల్లో, పూర్ థింగ్స్ 4 క్యాటగిరీల్లో ఆస్కార్ ని సొంతం చేసుకున్నాయి.