Ram Charan: ఆ కారణంతోనే ఉపాసన వేరే కాపురం వద్దంది
Ram Charan: టాలీవుడ్‌లో పవర్ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన (Upasana) ఒకరు. వీరి వివాహం జరిగి ఇప్పటికి పదకొండేళ్లు అవుతోంది. 2023లో చరణ్, ఉపాసనలకు పండంటి ఆడపిల్ల పుట్టింది. పాపకు క్లీంకారా అనే పేరు పెట్టారు. అయితే చరణ్ తన పెళ్లి ఎలా జరిగిందో ఓ సందర్భంలో వివరించారు.
2012 జూన్ 14న ఉపాసన, రామ్‌చరణ్‌ల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఉపాసన ఫామ్ హౌజ్ వీరి పెళ్లికి వేదికగా మారింది. అయితే జూన్ 14న వీరి పెళ్లి జరగ్గా.. 15న అదే ఫామ్ హౌజ్‌లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ ఫామ్ హౌజ్‌ను బాంక్వెట్ హాల్‌గా మార్చేసారు. రామ్ చరణ్, ఉపాసన పెళ్లికి హాజరైన వారి సంఖ్య 4000 వరకు ఉంటుంది. అయితే 14న పెళ్లి జరిగాక 15న మరోసారి పెళ్లి వేడుకను నిర్వహించి అక్కడే ఫ్యాన్స్‌కి భోజనాలు ఏర్పాటుచేసారు.
ఆరోజున జరిగిన వేడుక గురించి చరణ్ మరోసారి గుర్తు చేసుకున్నారు. “” నా పెళ్లి రోజున అమితాబ్ బచ్చన్ కూడా వచ్చారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నాన్నతో కలిసి డిన్నర్ చేసారు. ఆయన పెళ్లికి ఉండలేకపోయారు. ఎందుకంటే అప్పటికే ఆయన దుబాయ్ వెళ్లాల్సి ఉంది. నా పెళ్లి కోసం ఇండస్ట్రీలోని నా స్నేహితులంతా కలిసి ఎంతో సాయం చేసారు. సూర్య, తమన్నా, శృతి హాసన్, కాజల్ అగర్వాల్ ఇలా వీరంతా తమ ఇంట్లో జరుగుతున్న పెళ్లిగా భావించి ఎంతో సాయం చేసారు. అసలు వారు ఎలాంటి షూటింగ్స్ కూడా పెట్టుకోకుండా నా కోసం పెళ్లి పనులు చూసుకున్నారు. అదీకాకుండా మా ఇంట్లో నాది చివరి పెళ్లి. మా అక్క, చెల్లికి పెళ్లి అయిపోవడంతో ఇక నా పెళ్లే మిగిలింది. దాంతో గ్రాండ్‌గా చేయాలని అనుకున్నారు “” అని తెలిపారు.
ఉపాసన గురించి చెప్తూ..
నేను ఉపాసన ఏడేళ్ల పాటు మంచి స్నేహితులం. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నాం. సో నేను నా బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు ఫ్రెండ్‌గా ఉండాలో ఎప్పుడు భార్యగా ఉండాలో ఉపాసనకు బాగా తెలుసు. గోల్ఫ్ కోర్స్ ఏరియాలో ఓ ఇల్లు తీసుకున్నాను. పెళ్లయ్యాక అక్కడే వేరే కాపురం పెడదామని అనుకున్నాను. ఇదే విషయం ఉపాసనకు చెప్తే నన్ను భరించడం కష్టం అత్తామామల దగ్గరే ఉందాం అని ఉపాసన చెప్పింది. నన్ను దర్శకులు, నిర్మాతలు చాలా గారాబం చేసేవారు. కానీ నాన్న మాత్రం నన్ను సాధారణ బిడ్డగా పెంచాడు. పెళ్లయ్యాక నాలో చాలా బాధ్యత పెరిగింది. మార్పు వచ్చింది. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అని తెలిపారు చరణ్.