Vivek Agnihotri: బాలీవుడ్‌ని ప్రశ్నిస్తున్నాం.. అందుకే టార్గెట్ చేస్తున్నారు!
Mumbai: బాలీవుడ్(Bollywood) సినిమా, నెపోటిజం(Nepotism), మాఫియాపై తరచూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut). ఏదో ఒకచోట వీటి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ లో ఉన్న పలువురు టాప్ హీరోలు, నిర్మాతలని, వారి ఫ్యామిలీలని కొన్ని విషయాలలో విమర్శిస్తూనే ఉంటారు. తాజాగా కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) బాలీవుడ్లో కావాలనే తనని, కంగనాని టార్గెట్ చేశారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ అగ్నిహోత్రి మరోసారి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్నైతే బాలీవుడ్ లో పూర్తిగా దూరం పెట్టారు. నాకు మధ్యతరగతి ప్రజల్లో, ఆడియన్స్ లో సపోర్ట్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. కరణ్ జోహార్ సినిమాల్లో చూపించినట్టు బయట దేశంలోని యువత అలా ఉండదు. ఒకప్పుడు సినిమాలు చూస్తే వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు. ఇప్పటి సినిమాలకి కనెక్ట్ కావట్లేదు కాబట్టే ఎక్కువ పరాజయాలు చూస్తున్నారని, అందుకే ప్రేక్షకులు బాలీవుడ్ ని విమర్శిస్తున్నారని, బాయ్ కాట్ చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
‘ఇప్పుడు బాలీవుడ్ లో కొంతమంది నన్ను, కంగనాని టార్గెట్ చేశారు. బాలీవుడ్ లో జరిగే తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మల్ని దూరం పెడుతున్నారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది. అందుకే మా సినిమాలని, మమ్మల్ని టార్గెట్ చేసి, దూరం పెట్టి వేరు చేయాలనుకుంటున్నారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక్ అగ్నిహోత్రి. మరి వివేక్ వ్యాఖ్యలపై బాలీవుడ్ పెద్దలెవరైనా స్పందిస్తారేమో చూడాలి.