Virupaksha: రికార్డ్​లను బ్రేక్​ చేసిన మెగా మేనల్లుడు!

Hyderabad: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన కొత్త సినిమా విరూపాక్ష (Virupaksha). హర్రర్ థ్రిల్లర్ జోనర్‌‌లో, డార్క్ ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. సంయుక్త మీనన్‌(Samyuktha Menon) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సుకుమార్​(Sukumar) కథ, స్క్రీన్‌ప్లే తోడు కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.

విడుదలైన మొదటి రోజు ఫస్ట్‌ షో నుంచే బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ములేపుతున్న విరూపాక్ష సినిమా.. రెండోరోజు కూడా అదే రేంజ్‌లో కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. పాజిటివ్ టాక్ దక్కడంతో రెండో రోజు రూ.5 కోట్ల షేర్‌‌ వసూలు చేస్తుందని అంచనా వేశారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ షేర్‌‌ రాబట్టింది విరూపాక్ష సినిమా. రెండోరోజు ఏకంగా రూ.5.80 కోట్ల రేంజ్‌ షేర్ అందుకుంది. ఇక, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.7.30 కోట్ల షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది.

విరూపాక్ష సినిమా రెండో రోజు భారీ కలెక్షన్లను రాబట్టడమే కాకుండా.. టాలీవుడ్ స్టార్ హీరో హిట్ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) నటించిన ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమా విడుదలైంది.
ఈ సినిమా రెండో రోజు రూ.5 కోట్ల 20 లక్షలు షేర్ రాబట్టగా.. ‘విరూపాక్ష’ రెండో రోజు ఏకంగా రూ.5 కోట్ల 80 లక్షల షేర్‌ రాబట్టింది. దీంతో బాలయ్య హిట్ సినిమా రెండో రోజు రికార్డులను బద్దలు కొట్టింది. విరూపాక్ష సినిమాలో తేజ్‌కు జోడీగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటించగా కార్తీక్ వర్మ దర్శకత్వం వహించారు.