Vimanam: ఆకట్టుకుంటున్న సముద్రఖని నటన.. ట్రెండింగ్​లో ప్రోమో!

Hyderabad: విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ‘విమానం’ (Vimanam). ద్విభాషా చిత్రంగా తెలుగు(Telugu), తమిళం(Tamil)లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధం క‌నిపిస్తుంది. రాజు అనే పిల్లాడు ఒక్కసారైనా త‌న‌ని విమానం ఎక్కించ‌మ‌ని తన తండ్రి వీరయ్యను అడుగుతుంటాడు. విమానం ఎక్కడమంటే ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్నగా క‌నిపిస్తాయ‌ని అంటాడు. అయితే, బాగా చ‌దువుకుంటే పెద్దయ్యాక నువ్వే విమానం ఎక్కొచ్చని తండ్రి అంటాడు. ఈ సన్నివేశాన్ని సున్నితంగా, చ‌క్కగా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న భావోద్వేగాల‌ను ప్రోమోలో చూపించారు దర్శకుడు.

ఈ చిత్రంలో సముద్రఖని(Samuthirakani) అంగవైక‌ల్యంతో బాధపడే వ్యక్తిగా నటించారు. భార్య లేక‌పోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించనున్నారని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. సముద్రఖని స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది.జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్రపాటి క్రియేటివ్ వ‌ర్క్స్ సంయుక్తంగా ఈ సినిమా రూపొందిస్తున్నాయి. శివ ప్రసాద్ యానాల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్‌(Meera Jasmine), అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌(Anasuya Bhardwaj), రాహుల్ రామ‌కృష్ణ, ధ‌న్‌రాజ్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.