ఆ సినిమాల‌కే నంది అవార్డులు ఇవ్వాలి

Hyderabad: ఎస్​ఎస్​ రాజమౌళి(SS Rajamouli) తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్​(Vijayendra Prasad) పలు సినిమాలకు కథలను అందిస్తూ ఇటు టాలీవుడ్​తోపాటు అటు బాలీవుడ్​(Bollywood)లోనూ పాపులర్​ అయిన సంగతి తెలిసిందే. బాహుబలి(Bahubali), భజరంగీ భాయిజాన్​, రాజన్న వంటి హిట్​ చిత్రాలతోపాటు ప్రపంచాన్ని మెప్పించిన ఆర్​ఆర్​ఆర్​(RRR) సినిమాకు కూడా ఆయనే కథను అందించారు. విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad)​ పలు వేదికలపై సినీ పరిశ్రమపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. తాజాగా ఈయన ప్రతిష్టాత్మక నంది అవార్డుల(Nandi Awards)పై చేసిన వాఖ్యలు వైరల్​గా మారాయి.

గత కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డుల ప్రదానాన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స‌హ‌కారంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్ ఆధ్వర్యంలో “టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023” వేడుక‌లు దుబాయ్‌(Dubai)లో ఘ‌నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఫిలించాంబ‌ర్‌లో ప్రముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల విషయంలో అవలంభిస్తోన్న తీరుపై విజ‌యేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాల‌కు స్పెష‌ల్‌గా నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుందన్నది తన ఆలోచ‌న‌ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అద్భుత‌మైన పర్యటక ప్రాంతాలున్నాయని.. వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాల‌కు నంది అవార్డ్స్‌తో పాటు న‌గ‌దు ప్రోత్సాహ‌కాలిస్తే మ‌రిన్ని చిత్రాలు రూపొందడంతో పాటు తెలంగాణ‌లో టూరిజం పెరిగే అవ‌కాశం ఉంటుందని సూచించారు.