Veerasimha Reddy: “సింగిల్ హ్యాండ్” కౌంట‌ర్ ఎవ‌రికో!

Hyderabad:ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వీరసింహా రెడ్డి(Veerasimha Reddy), వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలు మంచి విజయం అందుకుని ప్రేక్షకులను అలరించాయి. ఈ రెండు సినిమాలూ టాలీవుడ్ సీనియర్​ హీరోలవే అవడం విశేషం. కాగా, నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వాల్తేరు వీరయ్య ఒక్కరోజు తేడాతో రిలీజ్​ అయ్యాయి. వీరసింహా రెడ్డి సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేయగా, వాల్తేరు వీరయ్య సినిమాని బాబి డైరెక్ట్ చేశారు.

ఇక, ఈ రెండు సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే మెగాస్టార్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఉండడం ఆ సినిమాకి బాగా కలిసి వచ్చింది. వీర సింహారెడ్డి కలెక్షన్స్ తో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే తాజాగా వీర సింహారెడ్డి 100 రోజుల పండగని ఘనంగా నిర్వహించాలని ప్లాన్​ చేశారు మేకర్స్​.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని పోస్టర్లు కలకలం రేపాయి. నందమూరి బాలకృష్ణ రోరింగ్ బ్లాక్ బస్టర్ హండ్రెడ్ డేస్ అనే పోస్టర్ మీద సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ (100 రోజులు సింగిల్ హ్యాండ్ తో సినిమాని ఆడించాడు) అంటూ పోస్టర్లు వేయడం కలకలం రేపింది. కచ్చితంగా మెగాస్టార్​ సినిమాకి కౌంటర్ గానే ఈ పోస్టర్లు ముద్రించారు అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఐటీ దాడులు కలకలం రేపుతున్న క్రమంలో ఇదొక తలనొప్పి వచ్చి పడిందంటూ సదరు ప్రొడక్షన్ హౌస్ ఎగ్జిక్యూటివ్ లు బాధపడుతున్నట్లు సమాచారం. మరి ఈ పోస్టర్​ వార్​ ఎంత దూరం పోతుందో చూడాలి మరి!