‘బలగం’ ఖాతాలో మరో రెండు అవార్డులు!
Hyderabad: కమెడియన్ వేణు ఎల్దండి (Venu Yeldandi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’(Balagam). చిన్న సినిమాగా రిలీజ్ అయినా అందరి మన్ననలు పొందుతూ.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఇతివృత్తంతో తెరకెక్కి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ సినిమా అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది.
ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయంగా నలభైకి పైగా అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. తాజాగా బలగం ఖాతాలో మరో రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చి చేరాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను దక్కించుకుంటోన్న ఈ చిత్రానికి స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 (Swedish International Film Festival 2023)లో రెండు అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడు (Best Actor) అవార్డు ప్రియదర్శి(Priyadarshi) , ఉత్తమ సహాయ నటుడు (Best Supporting Actor) అవార్డు బలగం కొమురయ్య కేతిరి సుధాకర్ రెడ్డికి వచ్చింది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో.. 2021లో ఫహాద్ ఫాజిల్ ‘జోజి’కు ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అలాగే గత ఏడాది మలయాళ చిత్రం ‘నాయట్టు’ సినిమాకు అవార్డ్ వచ్చింది. తర్వాత ఆ లిస్టులో తెలుగు సినిమా అయిన ‘బలగం’ ఉండటం విశేషం. ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil Raju) సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి (Harshith Reddy), హన్షిత (Hanshitha) నిర్మించారు.