Tollywood Directors: బెంచ్ మీద దర్శకులు
Tollywood Directors: కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులకు ఏ ప్రాజెక్టులు లేకపోతే బెంచ్ మీద కూర్చోపెట్టినట్లు.. మన టాలీవుడ్ దర్శకులు కూడా బెంచ్‌పై ఉండాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ చాలా మంది దర్శకులు మంచి ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు దర్శకులు ఫలానా హీరోతోనే సినిమా చేయాలని వారి డేట్స్ కోసం వేచిచూస్తున్నారు. కొందరు దర్శకులు తమ పాత మూస పద్ధతిని మార్చుకుని ఇప్పుడున్న ట్రెండ్‌కి సెట్ అయ్యేలా సినిమాలు చేయాలని ప్లాన్లు వేసుకుంటున్నారు. మరికొందరు యాక్టివ్‌గా ఉన్న దర్శకులు రోత సినిమాలతో ఫ్లాప్స్ మూటగట్టుకుంటున్నారు.
ఒకప్పుడు వరుసగా బ్లాక్‌బస్టర్ విజయాలను టాలీవుడ్‌కి అందించిన వివి వినాయక్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నట్లున్నారు. ఆయనే ఓ సినిమాలో నటిస్తున్నానంటూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. మరి ఆ సినిమా ఏమైందో తెలీదు. ఇక హరీష్ శంకర్, శ్రీకాంత్ అడ్డాల, పూరీ జగన్నాథ్‌లు బెంచ్‌పై ఉన్నారనే చెప్పుకోవాలి. డబుల్ ఇస్మార్ట్‌తో పూరీ జగన్నాథ్, మిస్టర్ బచ్చన్‌తో హరీష్ శంకర్ డిజాస్టర్లను మూటగట్టుకున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ఇది హిట్ అయితే మళ్లీ హరీష్ ట్రాక్‌లోకి వస్తారు. పూరీ జగన్నాథ్ ఎలాంటి సినిమాలు తీసి మళ్లీ ప్రేక్షకులను తన మ్యాజిక్‌తో పడేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు.
Tollywood Directors: ఇక శ్రీకాంత్ అడ్డాల గురించి చెప్పాలంటే పాపం ఆయన అంటూ ఒకడు ఉన్నాడు అనే సంగతే హీరోలు మర్చిపోయినట్లున్నారు. శ్రీకాంత్‌ను పూర్తిగా పక్కన పెట్టేసారు. దాంతో ఆయనకు అవకాశాలు రావడంలేదు. మరోపక్క వంశీ పైడిపల్లి వారసుడు తర్వాత కనిపించకుండాపోయారు. క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్లుని నమ్ముకుని ఉన్నారు. ఇది తప్ప ఆయన చేతిలో మరే సినిమాలు లేవు. దర్శకురాలైన నందినీ రెడ్డి కూడా బెంచ్‌పై ఉన్నారు. ఓ బేబీని అందించిన నందిని ఆ తర్వాత ఓ ఫ్లాప్ ఇవ్వడంతో ఆమె ప్రస్తుతానికి బ్రేక్‌లో ఉన్నారు.
విభిన్నమైన ఫ్రెష్ కథలను తెరపై చూపించే విక్రమ్ కె కుమార్ రెగ్యులర్ సినిమాపై కాకుండా ఓటీటీపై ఫోకస్ పెట్టారు. ఇక వినసొంపైన పాటలతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తీసే శివ నిర్వాణ కూడా ఖుషి తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు చెప్పుకున్నవారంతా టాలీవుడ్‌కి ప్రేక్షకులకు బాగా పరిచయమున్న వారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే. వారంతా ఒక సినిమా చేసేసి రెండో అవకాశం రాక ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి. మన టాలీవుడ్ దర్శకులు ఇలా బెంచ్‌పై ఉండటానికి ప్రధాన కారణం నటీనటులు ఆచితూచి కథలను ఎంచుకోవడమే. ఓ మంచి కథ దర్శకుడి దగ్గరికి వస్తే… అది హీరోకి నచ్చదు. ఒక్కోసారి ఆ కథ దర్శకుడికే నచ్చదు. ఇక రెండో కారణం ఏంటంటే.. పాత వారిని పక్కన పెట్టి ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు.
కొత్త దర్శకులు తమ క్రియేటివిటీని చూపిస్తూ తమ సత్తా నిరూపించుకుంటుంటే.. పేరుగాంచిన దర్శకులు మాత్రం అవుట్ డేటెడ్ స్టోరీలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. కాస్త లేట్ అయినా మంచి కథ, కథనంతో కమ్ బ్యాక్ ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీనే..!