రౌడీతో ‘ధమాకా’ బ్యూటీ!

‘ధమాకా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాలోనూ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. పెళ్లి చూపులు, గీత గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలతో మోస్ట్ పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన లైగర్ సినిమా నిరాశపరచడంతో తదుపరి చిత్రాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు రౌడీ హీరో. విజయ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఒక స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ‘VD 12’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించని ఈ చిత్రంలో శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్.
అంతేకాదు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న వినోదయా సీతంలోనూ ఓ ప్రత్యేక పాట చేయనుంది శ్రీలీల. అంతేకాదు ఈ పాట కోసం నిర్మాతలు ఆమెకి భారీ మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల చేసే ప్రత్యేక సాంగ్ హైలెట్గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదే బ్యానర్లో తెరకెక్కిన ధమాకా సినిమాలో మాస్ మహరాజా రవితేజ సరసన నటించింది శ్రీలీల. త్రివిక్రమ్.. మహేష్ తో చేస్తున్న మూవీలో కూడా శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను సెలక్ట్ చేస్తున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవరకొండ- శ్రీలీల కాంబినేషన్‌పై ఫ్యాన్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న పోస్టర్..
ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్‌ను విజయ్ చేయబోతున్నాడట. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిలా కనిపిస్తున్నాడు. పోస్టర్ మీద “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని రాసుంది. దీంతో పాటు సముద్రతీరంలో మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది.
గౌతమ్ తిన్ననూరి ‘మ‌ళ్ళీరావా’, ‘జెర్సీ’ రెండు సినిమాలతో మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘జెర్సీ’ సినిమాకు జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు ద‌క్కింది. ఇక, ఈ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్‌ ఎక్కాలని రౌడీ బాయ్ కసిగా ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా విజయ్‌ ఆశలపై నీళ్లు జల్లింది. ప్యాన్ ఇండియా లెవల్లో తీసిన సినిమా డిజాస్టర్ అయింది. దీంతో తన తర్వాతి సినిమాలపై విజయ్ ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం సమంతతో విజయ్ దేవరకొండ చేస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తోంది.