NTR శతజయంతి వేడుకల్లో తారక్​!

Hyderabad: నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్​ 1923, మే 28వ తేదీన జన్మించారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు రామారావు మరింతగా చేరువయ్యారు.
కాగా, 2023, మే 28న రామారావు శత జయంతిని ఘనంగా నిర్వహించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎమ్మెల్యే బాలకృష్ణ (Bala Krishna) నిర్ణయించారు. గడిచిన సంవత్సర కాలంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన విజయవాడలో ఉత్సవాల అంకురార్పణ సభ నిర్వహించారు. ఈ సభకు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.
రామారావు శత జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నా.. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కల్యాణ్‌ రామ్‌ మాత్రం వాటికి హాజరైనట్టు ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు, వాటి గురించి మాట్లాడిన సందర్భాలు కూడా లేవనే చెప్పాలి. అయితే, మే 28వ తేదీన జరిగే శత జయంతి కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని అందరూ అనుకున్నారు. అయితే, అదే రోజు వరంగల్‌లో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎన్టీఆర్‌‌ను తెలంగాణ మంత్రి ఆహ్వానించారు. అంతేకాదు, విగ్రహావిష్కరణకు వస్తానని యంగ్ టైగర్ మాట కూడా ఇచ్చేశారు.
దీంతో రామారావు శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరం కానున్నారని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగం కాబోతున్నట్టు వెల్లడించారు తారక్​. ఈనెల 20వ తేదీన కూకట్ పల్లిలో జరగనున్న శతజయంతి వేడుకలకు హాజరుకావాలని జూనియర్ ఎన్టీఆర్‌‌కు నందమూరి రామకృష్ణ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమానికి కల్యాణ్‌ రామ్ (Kalyan Ram), పురందేశ్వరి దంపతులు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.