Indian Film: సౌత్ సినిమా వాటా 52 శాతం!
Hyderabad: దక్షిణాది సినిమా అంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ (Bollywood)అనుకునేవాళ్లు చాలామంది. కానీ ప్రస్తుతం ఆ హద్దులు చెరిగిపోయాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం చిత్రాలు పాన్ ఇండియా(Pan India) సినిమాలుగా రిలీజ్ అవుతుండటంతో పాటు భారీ కలెక్షన్లను రాబడుతూ సౌత్ సినిమా(South Cinema)నే ఇండియన్ సినిమాగా మారిపోయింది. అంతేకాదు మొత్తం ఇండియా సినిమా రెవెన్యూలో దక్షిణాది అయిదు రాష్ట్రాల వాటా 52 శాతానికి చేరిందని లెక్కలు చెబుతున్నాయి.
2022లో ఆర్‌ఆర్‌ఆర్(RRR), కేజీఎఫ్-2(KGF2), కాంతార(Kantara) వంటి బ్లాక్‌బస్టర్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వసూళ్లలో సింహభాగం దక్షిణాది చిత్రాలు కొల్లగొట్టాయి. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం సినిమాల వసూళ్లు రూ.15వేల కోట్లు అయితే, ఇందులో దక్షిణాది చిత్రాల వాటా రూ.7,836 కోట్లుగా తేల్చారు. మొత్తం రాబడిలో ఇది 52 శాతం. కాగా, సినిమాల సంఖ్య విషయానికి వస్తే 2022లో 1,691 విడుదల కాగా, అందులో 54 శాతం అంటే 916 సినిమాలు దక్షిణాది రాష్ర్టాలకు చెందినవి. తాజా సంవత్సరం అంచనాలకు వస్తే.. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలు గతేడాది కన్నా బలంగా వసూళ్లు సాధిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో అదేస్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. కన్నడ సినిమాల విషయానికి వస్తే గతేడాది కేజీఎఫ్ 2, కాంతార బాక్సాఫీస్‌ను దున్నేయడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ ఏడాది దక్షిణాది సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో చూడాలి మరి!