అందుకే సమంతని తీసుకోలేదు..నిర్మాత కామెంట్స్
Hyderabad: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి సమంత(Samantha). కొన్నాళ్లుగా సమంతపై రకరకాల వార్తలు, నెగెటివిటీ ప్రచారంలో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం(Shaakunthalam) సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇక ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు కూడా సమంతపై రకరకాలుగా కామెంట్స్ చేయడం చర్చకు దారితీస్తుంది. తాజాగా సమంత కెరీర్ ప్రారంభంలో జరిగిన విషయాల గురించి డైరెక్టర్ శివ నాగేశ్వరరావు(Siva Nageswarao) మాట్లాడారు. తన సినిమా ఆడిషన్స్‌కి వచ్చిన సమంత ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని, అందుకే ఆ సినిమాలో తీసుకోలేదనీ చెప్పుకొచ్చారు.
రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ అయిన శివ నాగేశ్వరరావు.. ‘మనీ’, ‘మనీ మనీ’, ‘సిసింద్రీ’, ‘హేండ్సప్’, ‘ధనలక్ష్మి ఐ లవ్ యూ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజాకృష్ణమూర్తి’ లాంటి కామెడీ ఎంటర్టైనర్లను తెలుగు ప్రేక్షకులకు అందించారు. హీరోయిన్ అంజలిని పరిచయం చేసింది కూడా ఈయనే. ఈ ఏడాది మళ్లీ కొత్త నటీనటులతో ‘దోచేవారెవరురా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు శివ నాగేశ్వరరావు. ‘నిన్ను కలిసాక’ సినిమాకు సమంతను ఆడిషన్ చేసినట్టు తెలిపారు. ‘సమంత అప్పుడు చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోంది. నిన్ను కలిసాక సినిమా ఆడిషన్ కోసం ఆమెను హైదరాబాద్ రమ్మని పిలిచాం. సమంత ఆడిషన్ చాలా బాగా ఇచ్చింది. కానీ, చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది. ఆమె అడిగిన పారితోషికం మా బడ్జెట్ పరిధిలో లేదు. అందుకే ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయలేదు. కానీ, తన అద్భుతమైన నటనతో ఈ స్థాయికి ఎదిగింది’ అన్నారు డైరెక్టర్ శివనాగేశ్వర రావు.