Ayalaan: పాన్ ఇండియా సినిమా ప్రకటించిన శివకార్తికేయన్!

Chennai: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శివ కార్తికేయన్ ఇటీవల చేస్తున్న సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజై మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ప్రిన్స్ (Prince) సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు శివ. ఈ సినిమాకు టాలీవుడ్​ డైరెక్టర్​ అనుదీప్ దర్శకత్వం వహించారు.
తాజాగా శివ కార్తికేయన్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ కు మహా వీరుడు అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తాను నటిస్తున్న మరో సినిమా విడుదల తేదీని ప్రకటించేశాడు శివ కార్తికేయన్. రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా ఆర్‌‌.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా అయలాన్ (Ayalaan). సౌత్ ఇండియాలో ఏలియన్ ప్రధాన పాత్రలో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
ఈ సినిమాను దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో అయలాన్ అంటే ఏలియన్ అని అర్ధం. సైన్స్ ఫిక్షన్, కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న అయలాన్ సినిమాలో దాదాపు 4500 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ఉన్నాయని, పూర్తి స్థాయి యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాను రూపొందిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
ఈ సినిమాలో ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు, శరద్ ఖేల్కర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’ సినిమాతో ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి మరి.