ఇలాంటి వాళ్ల‌ని ఎలా న‌మ్ముతారో.. క‌మ‌ల్‌పై సింగ‌ర్ మండిపాటు

Chennai: ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీపాద‌ (chinmayi sripada).. క‌మ‌ల్ హాస‌న్‌ (kamal haasan) పై మండిప‌డ్డారు. గ‌తంలో ఆమె ప్ర‌ముఖ లిరిసిస్ట్ వైరాముత్తు (vairamuthu)పై లైంగిక ఆరోప‌ణ‌లు చేసారు. చాలా సార్లు త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని అన్నారు. అయినా చిన్మ‌యిని ఎవ‌రూ న‌మ్మ‌లేదు. పైగా వైరాముత్తుకే అంద‌రూ స‌పోర్ట్ చేసారు. ఆయ‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిందంటూ చిన్మ‌యిని ఐదేళ్ల పాటు ఇండ‌స్ట్రీ నుంచి బ్యాన్ చేసారు. అయితే.. ఇప్పుడు దిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద రెజ్ల‌ర్లు.. WFI (రెజ్ల‌ర్స్ ఫెడ‌రేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్‌ (brij bhushan sharan singh)కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నెల రోజుల నుంచి  కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై క‌మ‌ల్ హాస‌న్ (kamal haasan) మండిప‌డ్డారు.

“రెజ్ల‌ర్లు ఆందోళ‌న చేప‌ట్టి నేటికి నెల రోజులు కావొస్తోంది. దేశం కోసం పోరాడాల్సింది పోయి వారి చేత మ‌నం భ‌ద్ర‌త కోసం పోరాడేలా చేస్తున్నాం. తోటి భార‌తీయులారా.. మ‌న అటెన్ష‌న్ ఎవ‌రికి ఇవ్వాలి? మ‌న జాతీయ క్రీడాకారుల‌కా.. లేక నేర చ‌రిత్ర ఉన్న ఓ పొలిటిషియ‌న్‌కా?” అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కు చిన్మ‌యి శ్రీపాద రిప్లై ఇచ్చారు. “క‌ళ్ల ముందే ఓ లిరిసిస్ట్ నా ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తే అత‌ను ఓ గొప్ప వ్యక్తి అని నాకు ఎవ్వ‌రూ స‌హాయం చేయ‌లేదు. బ‌దులుగా న‌న్ను 5 ఏళ్లు త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బ్యాన్ చేసారు. క‌ళ్ల ముందు జ‌రిగిన దారుణం గురించి ప‌ట్టించుకోకుండా ఆడ‌వాళ్ల భ‌ద్ర‌త గురించి మాట్లాడే పొలిటిషియ‌న్ల‌ను ఎలా న‌మ్ముతారు? జ‌స్ట్ అడుగుతున్నా. ఇప్పుడు నా టైంలైన్‌లో నోటికొచ్చిన బూతుల‌తో నిండిన ట్వీట్లు ఉంటాయి. నేను ఎగ్జిట్ అవుతున్నా” అని ట్వీట్ చేసారు.