Siddharth: కొత్త సినిమా క‌లెక్ష‌న్‌ రూ.15 ల‌క్ష‌లు.. ఓయ్ రీరిలీజ్ క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా?

Siddharth: ఈ మ‌ధ్య‌కాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ విప‌రీతంగా పెరిగిపోయింది. నిన్న వ్యాలెంటైన్స్ డే (Valentine’s Day) రోజే ఏకంగా 7 సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో సిద్ధార్థ్‌, బేబీ షామిలి న‌టించిన ఓయ్ (Oye) సినిమా కూడా ఉంది. 2009లో వ‌చ్చిన ఈ సినిమాను ఆనంద్ రంగ డైరెక్ట్ చేసారు. ఆ స‌మ‌యంలో ఇలాంటి ల‌వ్ స్టోరీలు పెద్ద‌గా క్లిక్ అవ్వ‌లేదు. మ‌న తెలుగోళ్ల‌కు ఏ సినిమా అయినా చివ‌ర్లో విల‌న్ చ‌స్తేనే చూస్తారు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ చ‌నిపోతే ఆ సినిమాను ఫ్లాప్ చేసేస్తారు. ఓయ్ కూడా ఈ జోన‌ర్‌కు చెందిన‌దే.

ఓయ్ సినిమాలో బేబీ షామిలి క్యాన్స‌ర్‌తో చనిపోతుంది. దాంతో అప్ప‌ట్లో పాట‌లు హిట్ అయ్యాయి కానీ సినిమా మాత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. 2002లో వ‌చ్చిన ఎ వాక్ టు రిమెంబ‌ర్ (A Walk To Remember) అనే ఇంగ్లీష్ సినిమాను ఆధారంగా చేసుకుని ఓయ్‌ క‌థ రాసుకున్నారు ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగ‌. ఆ త‌ర్వాత ఈ సినిమాను త‌మిళంలో కాద‌ళ్ అలై అనే టైటిల్‌తో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. ఏదేమైనా అప్ప‌ట్లో మాత్రం సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు రీ రిలీజ్‌ల ప‌ర్వం న‌డుస్తున్న నేప‌థ్యంలో ఫ్లాప్, అట్ట‌ర్ ఫ్లాప్ అయిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అవుతున్నాయి. (siddharth)

ALSO READ: Aditi Rao Hydari: సిద్ధార్థ్‌తో క‌లిసి ఫొటో.. అది జ‌ర‌గ‌ని ప‌ని

ఓయ్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఓయ్ రీరిలీజ్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి సిద్ధార్థ్ కూడా షాక‌య్యారు. అయితే సిద్ధార్థ్ న‌టించిన కొత్త సినిమా చిన్నాకు (Chinna) రిలీజ్ అయిన రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ చూస్తే షాక‌వ్వాల్సిందే. చిన్నా సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వ‌గా.. తొలి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్లు రూ.15 ల‌క్ష‌లు మాత్ర‌మే. త‌మిళంలో చిత్తా (Chittha) టైటిల్‌తో రిలీజ్ అయింది. త‌మిళంలో క‌లెక్ష‌న్ బాగానే ఉంది కానీ తెలుగులో ఫ్లాప్ అయింద‌నే చెప్పాలి. అయితే ఓయ్ రీ రిలీజ్ రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా.. రూ.1.5 కోట్లు. 2024లో రీ రిలీజ్ అయిన సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబట్టిన సినిమాగా ఓయ్ నిలిచింది.

దీనిని బ‌ట్టి చూస్తే ఆల్రెడీ ఇండ‌స్ట్రీలో పేరుగాంచిన హీరోలు గ‌తంలో ఏ సినిమాలైతే ఫ్లాప్ అయ్యాయో వాటిని రీ రిలీజ్ చేసేస్తే స‌గం బ‌డ్జెట్ అయినా క‌లెక్ష‌న్ల రూపంలో వ‌చ్చేస్తుంద‌ని గ‌ట్టిగా చెప్ప‌చ్చు. సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) న‌టించిన పోకిరి (Pokiri) సినిమాతో రీ రిలీజ్‌ల ట్రెండ్ మొద‌లైంది. ఈ సినిమాకు ఆడియ‌న్స్ రీ రిలీజ్ రోజు చేసిన ర‌చ్చ‌కు టాలీవుడ్‌తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల మైండ్ బ్లాక్ అయింది. అలా పోకిరి నుంచి మొద‌లై ఎన్నో సినిమాల‌ను రీ రిలీజ్ చేస్తూ చాలా మందికి కాలేజ్ రోజుల్ని గుర్తుకు వ‌చ్చేలా చేసారు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు.