Nainisha Rai: తిండి లేక రక్తం అమ్ముకున్నా.. నటి సంచలన వ్యాఖ్యలు

Nainisha Rai: కష్టాలు ఎక్కువైతే.. ఆమెవి సీరియల్ కష్టాల్రా బాబూ అని అంటారు. సీరియల్‌లో చూపించే కష్టాలు అలా ఉంటాయి మరి. కానీ ఆ పాత్రల్ని పోషించే వారి రియల్ లైఫ్‌లో అంతకు మించిన కష్టాలే ఉంటాయి. బ్రహ్మముడి సీరియల్‌లో తన అద్బుత నటనతో ఆకట్టుకుంటున్న అప్పు రియల్ లైఫ్ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు.

బ్రహ్మముడి సీరియల్‌లో అన్ని పాత్రలూ ఓ లెక్కైతే.. అప్పు పాత్ర మరో లెక్క. ఆ పాత్రను పోషిస్తున్న నటి పేరు నైనిషా రాయ్. ఈ బెంగాలీ చిన్నది చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో బెంగాలీ మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. చదువు పూర్తైన తరువాత.. బెంగాలీ సినిమాల్లో నటించింది. అనంతరం తెలుగులో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్‌తో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ‘శ్రీమంతుడు’, ‘భాగ్య రేఖ ‘హంసగీతం’, ‘ఇంటిగుట్టు’ ఇలా చాలా సీరియల్స్‌లో నటించింది. ఈటీవీలో ప్రసారం అయిన ‘శ్రీమంతుడు’ అనే సీరియల్‌లో హీరోయిన్‌గా నటించింది నైనిషా రాయ్.

ఆ సీరియల్ ఆమెకు గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ తరువాత మాటీవీలో ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సీరియల్‌లో నెగిటివ్ రోల్ పోషించింది. బ్రహ్మముడి సీరియల్‌తో పాటు.. ‘వంటలక్క’ సీరియల్‌లో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది నైనిషా రాయ్. 2021లో కథానిక అనే తెలుగు సినిమాలో నటించింది నైనిషా రాయ్. ఆ తరువాత 2023లో ప్లాన్ బి అనే సినిమాలోనూ నటించింది. అయితే రీల్ లైఫ్‌లో ఎన్ని కష్టాలను పడిందో.. రియల్ లైఫ్‌లో అంతకు మించిన కష్టాలనే పడింది నైనిషా రాయ్.

సీరియల్‌లో అనే పాత్రల్లో మెప్పించిన నైనిషా రాయ్.. రియల్ లైఫ్‌లో అంతకుమించిన కష్టాలనే చూసింది. బెంగాలీ కుటుంబానికి చెందిన నైనిషా రాయ్ తండ్రి లెక్చలర్ కాగా.. తల్లి హౌస్ వైఫ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నైనిషా రాయ్‌.. ఆమె పేరెంట్స్‌కి కూడా దూరం అయ్యింది. నైనిషా రాయ్ ఇండస్ట్రీ వైపు రావడం వాళ్లకి ఇష్టం లేకపోవడంతో.. కూతురితో బంధాన్ని తెంచేసుకున్నారు. దాంతో నైనిషా రాయ్ తన పేరెంట్స్ గురించి చెప్తూ.. ‘వాళ్ల ఆలోచనలో వాళ్లు కరెక్టేమో కానీ.. నాకు మాత్రం వాళ్లు చేసింది తప్పు’ అని చెప్పింది.

ఇక ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను చెప్తూ.. ఇండస్ట్రీ వైపు వచ్చిన తరువాత.. కనీసం తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఆకలి తీర్చుకోవడానికి నా రక్తం నేనే డొనేట్ చేసి కడుపునింపుకున్నాను. అన్ని కష్టాలను ఎదుర్కొని నటిగా ప్రయత్నిస్తే.. మరి నాకేంటి? అని ఎదురైన పరిస్థితులు నా లైఫ్‌లో చాలానే ఉన్నాయి. నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా. కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తాం అని అనేవారు. నేను కమిట్ మెంట్ ఇస్తాననే ఉద్దేశంలోనే నాకు ఓ ఆఫర్ ఇచ్చారు.

షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.. ఇక వాళ్లు నన్ను రమ్మని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. నాకు ఇష్టంలేని పని చేయనని.. వాళ్లని కొట్టి మరీ వచ్చేశాను. ఆ తరువాత నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఈ కష్టాలను అభవించలేక.. చనిపోవాలని అనుకున్నాను. కష్టం వచ్చిందని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. అలాగని తిరిగి ఇంటికి వెళ్లలేను. నాకూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా.. దాన్ని చంపుకోలేను. కష్టాలను భరించలేక చనిపోవాలని అనుకున్నాను.. చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశాను అంటూ చెప్పుకుని తన కష్టాలను కళ్లకి కట్టింది బ్రహ్మముడి అప్పు అలియాస్ నైనిషా రాయ్.