Salman Khan: కృష్ణజింకను చంపింది నేను కాదు
Salman Khan: బ్లాక్‌బక్ (కృష్ణజింక) కేసు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఇంకా వెంటాడుతోంది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతున్న సమయంలో సినిమాలోని నటులతో కలిసి ఆయన ఓ జీపు ఎక్కి మరీ బ్లాక్‌బక్‌ను వెంటాడాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సల్మాన్‌పై కేసు నమోదైంది. రాజస్థాన్‌కి చెందిన బిష్ణోయ్ వర్గానికి బ్లాక్ బక్ అంటే ఎంతో పవిత్రమైనది. దాని కోసం అక్కడ వెయ్యేళ్ల నాటి ఆలయం కూడా ఉందట. అలాంటి బ్లాక్‌బక్‌ను సరదాల కోసం చంపేస్తే ఊరుకుంటారా?
ఐదేళ్ల క్రితం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్ ఖాన్ బ్లాక్‌బక్‌ను చంపిన కేసులో దోషే అని తేలుస్తూ ఆరేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దాంతో ఆయన్ను జోధ్‌పూర్ సెంట్రల్ కోర్టుకు తరలించారు. రెండు రోజులు అక్కడే గడిపిన సల్మాన్ వెంటనే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మళ్లీ జైలుకి వెళ్లింది లేదు. దాంతో సల్మాన్‌కు జైలు శిక్ష సరిపోదని.. మరణ శిక్షే కరెక్ట్ అని బిష్ణోయ్ వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నిర్ణయించేసుకున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు సల్మాన్‌ను చంపేయడం తథ్యం అని పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారు.
దాంతో సల్మాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం మూడంచెల భద్రతను కల్పించగా.. సల్మాన్ తన కోసం రూ.2 కోట్లు పెట్టి దుబాయ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారును తెప్పించుకున్నాడు. అయితే.. ఈ బ్లాక్‌బక్ కేసు గురించి సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అసలు బ్లాక్ బక్‌ను తాను చంపలేదని అన్నారు. ఎవరు చంపారో చెప్పినా ఇప్పుడు లాభం లేదని కూడా అన్నారు. దాంతో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.