RRR: నిర్మాతను కావాలనే పక్కన పెడుతున్నారా?
Hyderabad: దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్(RRR). 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డి.వి.వి. దానయ్య(DVV Danayya) నిర్మించిన ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఏకంగా ఆస్కార్(Oscar)ను సైతం దక్కించుకుంది. అంతా బానే ఉన్నా ఈ సినిమా నిర్మాత దానయ్య ఈ అవార్డులు, సంబరాల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది. తాజాగా జరిగిన సన్మానోత్సవంలోనూ దానయ్య కనపడకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ మళ్లీ మొదలైంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ సైతం దక్కించుకుంది. అయితే `ఆర్ఆర్ఆర్` అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి.. ఈ నాలుగు పేరులే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ నిర్మాత డి.వి.వి. దానయ్యను అందరూ మరిచిపోయారు. గోల్డెన్ గ్లోబ్ వేదికపేనే కాదు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లోనూ దానయ్య పేరును ప్రస్తావించలేదు. అయితే ఆస్కార్ ప్రమోషన్స్‌కు అయ్యే ఖర్చు దానయ్య పెట్టుకోకపోవడమే ఇందుకు కారణమనీ, రాజమౌళి కావాలనే దానయ్యను పక్కన పెట్టారని టాక్. ఆస్కార్ కోసం అయిన పూర్తి ఖర్చుని రాజమౌళితోపాటు నిర్మాత శోభు యార్లగడ్డ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై దానయ్య మాట్లాడుతూ తననెవరూ సంప్రదించలేదు అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దానయ్య అలకకు ఆస్కార్ ఖర్చు ఒక్కటే కారణం కాదంటూ ఓ కొత్త వాదన మొదలైంది. అసలు ఆర్ఆర్ఆర్తో దానయ్యకు లాభం రాలేదని అందుకే ఈ సంబరాలకు దూరంగా ఉన్నారంటూ చర్చ జరుగుతోంది. మరి వీటిపై అటు ఆర్ఆర్ఆర్ టీమ్ గానీ, ఇటు దానయ్యగానీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.