ముగ్గురు హీరోల కెరీర్‌ను నాశనం చేసిన బంగ్లా
Rajesh Khanna: ఒక బంగ్లా ముగ్గురు హీరోల కెరీర్‌ను నాశనం చేసిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజంగానే జరిగింది. ఆ ముగ్గురు హీరోల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేశ్ ఖన్నా కూడా ఉన్నారు. ఇంతకీ ఏంటా బంగ్లా? ఎక్కడుంది? ముంబైలోని కార్టర్ రోడ్డు ప్రాంతంలో సముద్రానికి కొద్ది దూరంలోనే ఈ బంగ్లా ఉంది. ముందు దీనిని 1950ల్లో భరత్ భూషణ్ అనే హిందీ నటుడు కొనుగోలు చేసారు. భరత్ భూషణ్ అప్పట్లో మంచి పేరున్న నటుడు. ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన ఎప్పుడైతే ఈ బంగ్లాను కొనుగోలు చేసారో అప్పటి నుంచి అసలు భరత్ పేరే ఇండస్ట్రీలో వినిపించకుండాపోయింది.
ఈ ఇంట్లోకి వెళ్లిన తర్వాత భరత్ అప్పులపాలయ్యారట. ఆ తర్వాత 1960ల్లో రాజేంద్ర కుమార్ అనే మరో నటుడు కొనుగోలు చేసారు. ఆయన ఈ ఇంటిని కొనుగోలు చేయకముందు వరకు మంచి పేరున్న నటుడు. ఎప్పుడైతే ఈ బంగ్లా కొనుగోలు చేసారో కొన్నాళ్లకే అప్పుల బాధలతో బంగ్లాను అమ్మకానికి పెట్టారు. దాంతో ఈ బంగ్లాను రాజేష్ ఖన్నా కొనుగోలు చేసారు.
1970ల్లో రాజేష్ ఖన్నా ఈ బంగ్లాను కొనుగోలు చేసారట. ఆయన కొన్నాక ఈ బంగ్లాకు ఆశీర్వాద్ అనే పేరు పెట్టారు. ఈ ఇంట్లోకి కుటుంబంతో సహా అడుగుపెట్టిన రాజేష్ ఖన్నాకి ఉన్నట్టుండి సినిమాలు లేకపోవడం.. కుటుంబంలో కలహాలు రావడం జరిగాయి. ఆయన భార్య డింపుల్ కపాడియా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. చివరి రోజుల్లో రాజేష్ ఖన్నా ఇదే బంగ్లాలో ఒంటరిగా ఉంటూ చనిపోయారని చెప్తుంటారు. ఆ తర్వాత ఈ బంగ్లాను మరో వ్యక్తి కొనుగోలు చేసి సగం భాగం కూల్చి వేయించారు. కాస్త కొత్తగా కట్టించి.. పాత జ్ఞాపకాలు ఏవీ కనిపించకుండా కొత్త రూపు తెచ్చారు.