Prema Vimanam: టీజ‌ర్ రిలీజ్ చేసిన మ‌హేష్‌!

Hyderabad: దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చర్స్, ZEE5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్ ‘ప్రేమ విమానం’(Prema Vimanam). ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను గురువారం (ఏప్రిల్ 27)న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు(Mahesh Babu) రిలీజ్ చేశారు. ఈ సిరీస్​లో సంగీత్ శోభ‌న్‌(Sangeeth Shoban), శాన్వి మేఘ‌న(Sanvi Meghana) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అన‌సూయ‌, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో అలరించనున్నారు.

ఆసక్తికరంగా సాగే ఈ టీజర్​లో ఓ ప‌ల్లెటూరులోని ఇద్ద‌రు పిల్ల‌లు వారికి ద‌గ్గ‌ర‌గా ఉండే కొండ‌నెక్కి విమానాన్ని చూస్తుంటారు. అందులో ఓ పిల్లాడు మ‌రో పిల్లాడితో ‘అరే మ‌నం కూడా విమానంలో పోదాం రా’ అంటాడు. వారిద్దరూ విమానాన్ని చూడగానే సంతోషపడుతుంటారు. అసలు విమానం అంత ఎత్తు ఎలా ఎగురుతుందనే సందేహం కూడా వారిలో ఉంటుంది. అదొక్కటే కాదు.. విమానానికి సంబంధించి వారికి చాలా సందేహాలుంటాయి. వాటన్నింటినీ వారి గూడెంలోని వ్యక్తి (వెన్నెల కిషోర్)ని అడుగుతుంటారు. పిల్లల సందేహాలు తీర్చలేక అతని తల ప్రాణం తోకకొస్తుంటుంది. ‘విమానం కనిపెట్టిన రైట్స్ బ్రదర్స్‌కి కూడా ఇన్ని డౌట్స్ వచ్చుండవు. ఏం పీకుతార్రా విమానం గురించి తెలుసుకుని’ అని అసహనం వ్యక్తం చేస్తుంటాడు.

మరో వైపు ఓ ప్రేమ జంట (సంగీత్ శోభన్, శాన్వి మేఘన) సంతోషంగా ఉంటారు. అబ్బాయి, అమ్మాయి మధ్యలో మనస్పర్దలు, వాటికి కారణం ఏంటి? వారి ప్రేమ‌ని ఊరు అంగీక‌రిస్తుందా? చివ‌ర‌కు వారు విమానం ఎక్కి ఎందుకు పారిపోవాల‌ని అనుకుంటుంటారు. వీరంద‌రూ ఒక‌చోట చేరిన‌ప్పుడు ఏం జ‌రుగుతుంది. అస‌లు విమానానికి వీరి జీవితాల‌కు సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.