Kalki: నాగ్ అశ్విన్ షాకింగ్ నిర్ణయం.. వర్కవుట్ అయ్యేనా?
Kalki: ఆదిపురుష్ (Adipurush) డిజాస్టర్ తర్వాత మాంచి హిట్ కోసం ఆకలి మీదున్న రెబెల్ స్టార్ ప్రభాస్‌కు (Prabhas) సలార్‌తో (Salaar) బ్లాక్ బస్టర్ రిలీఫ్ లభించింది. ప్రశాంత్ నీల్ (Prashant Neel) ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చేసారు. ఇక సలార్ రెండో భాగం కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ గ్యాప్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టాలని అనుకుంటున్నారు. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో కల్కి 2898 AD (Kalki 2898 AD) అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్ మిక్కీ జే మేయర్‌ను (Mickey j meyer) ఎంపికచేసారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని కూడా క్రియేట్ చేసేసారు. అయితే కల్కి గ్లింప్స్‌తో మిక్కీ జే మేయర్ మార్క్ కనిపించలేదని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారట. తేడా వస్తే ఫ్యాన్స్ నుంచి మామూలు టార్చర్ ఉండదని ముందే ఊహించిన నాగ్ అశ్విన్ రిస్క్ ఎందుకని మిక్కీని తీసేసి ఆయన స్థానంలో సంతోష్ నారాయణన్‌ను (Santosh Narayanan) పెట్టారు.
సంతోష్ నారాయణన్ వర్క్ గురించి చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) నటించిన సైంధవ్ (Saindhav) సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసారు. కానీ సైంధవ్ పాటలు కూడా పెద్దగా మెప్పించింది ఏమీ లేదు. అలాంటిది మిక్కీని తీసేసి నాగ్ అశ్విన్ సంతోష్ నారాయణన్‌ను పెట్టడం కాస్త చర్చనీయాంశంగా మారింది.
మరోపక్క సలార్‌తో విధ్వంసం సృష్టించిన ప్రభాస్ ఇక కల్కి సినిమాతో ఏ రేంజ్లో కనిపించబోతున్నారా అని ఫ్యాన్స్ ఊపిరి బిగ్గపట్టి ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా VFXపై ఎక్కువ ఆధారపడి ఉంది. VFX అంటే అల్లాటప్పా VFX కాదు. దాదాపు పదేళ్ల పాటు రీసెర్చ్ చేసి అవెంజర్స్, అవతార్ రేంజ్‌తో సినిమా డిజైన్ ఉండబోతోందట. ఈ విషయాన్ని కల్కికి VFX ఎడిటర్‌గా పనిచేస్తున్న విశాల్ కుమార్ ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్లో తెలిపారు. కల్కి ఎంత వరకు వచ్చింది అని ఫ్యాన్స్ అడగ్గా.. మాకు పదేళ్లు పట్టింది ఈ పై రీసెర్చ్ చేయడానికి. అవతార్, అవెంజర్స్ రేంజ్లో సినిమా ఉండబోతోంది. ఇది ఆదిపురుష్‌లా కాదు అని ఓం రౌత్ తీసిన కళాఖండంపై సెటైర్ వేసారు.
కల్కి సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేసారు. అయితే ఇప్పటికీ ఇంకా ఈ సినిమాక సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ జరగకపోవడంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ప్రమోషన్స్ చేయడం లేదు అని ట్విటర్లో నాగ్ అశ్విన్‌ని ట్యాగ్ చేసి కామెంట్స్ పెడుతున్నారు. సినిమా ఆడుతుందా లేదా అనే డౌట్ ఏమన్నా ఉందా? అందుకే సైలెంట్‌గా ఉంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ నుంచి సినిమా వస్తోందంటే ఆ హడావిడి అంతా ఇంతా ఉండదు. సలార్ రిలీజ్ టైంలో రచ్చ రచ్చ చేసిన డార్లింగ్ ఇప్పుడు కల్కి సినిమా గురించి ఎందుకు ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా కచ్చితంగా మే 9న రిలీజ్ అవుతుందా లేక ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల మళ్లీ వాయిదా వేసే ఆలోచనలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.