Pawan Kalyan: డైరెక్ట‌ర్‌గా 20 ఏళ్లు​!

Hyderabad: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతికేళ్లు దాటిపోయింది. కెరీర్‌‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి హీరోగా కాకుండా టెక్నీషియన్‌ కావాలని పవన్‌ అనుకున్నారు. దర్శకత్వంపై కూడా ఆయనకు మక్కువ. 1996లో ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’తో హీరోగా వచ్చి సక్సెస్ అందుకున్నారు పవన్. ఆ తరువాత వరుసగా గోకులంలో సీత, సుస్వాగతం, బద్రి, తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి సినిమాల్లో నటించి సూపర్‌‌ హిట్లు అందుకున్నారు. ఆయన కెరీర్‌‌లో ఖుషి బిగ్గెటస్ట్ హిట్‌గా నిలిచింది.

ఆ సినిమా విజయోత్సవ సభలో “ఇకపై మీరు అద్భుతాలు చూడబోతున్నారు” అంటూ అభిమానులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. ‘ఖుషి’ విడుదలైన దాదాపు రెండు సంవత్సరాలకు ‘జానీ’ (Johnny) సినిమా చేశారు. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించారు పవన్. హీరోగా పరిచయం చేసిన అల్లు అరవింద్ జానీ సినిమాను కూడా నిర్మించారు. 2003 ఏప్రిల్‌ 25వ తేదీన జానీ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించారు రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్, రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ పాట కూడా పాడటం విశేషం. అంతేకాదు, తనకు ప్రావీణ్యం ఉన్న మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన ఫైట్స్‌ కూడా జానీ సినిమాలో ఉండేలా జాగ్రత్త పడ్డారు పవన్. జానీ సినిమా అనుకున్నంత కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. పవన్ ఫ్యాన్స్‌ కు మాత్రం మంచి ఫీల్ అందించింది. ఓ.హెన్రీ రాసిన ‘లాస్ట్ లీఫ్’ కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ జానీ సినిమాను తెరకెక్కించారు.