Gaanja Shankar: సాయి ధరమ్ తేజ్‌కు నార్కోటిక్స్ బృందం షాక్
Gaanja Shankar: సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కొత్త సినిమా చిక్కుల్లో పడింది. ఆయన నటిస్తున్న గాంజా శంకర్ సినిమాపై తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం ఎక్కువ అయిపోతున్న నేపథ్యంలో అందులోనూ టాలీవుడ్‌కి చెందిన ఎందరో ప్రముఖులు కూడా ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యి ఉన్న నేపథ్యంలో మళ్లీ డ్రగ్స్ గురించి సినిమాలు తీయడంపై నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టైటిల్‌లోనే గంజా అని ఉండడంపై వారు మండిపడుతున్నారు. సినిమా టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసారు.
సినిమా టైటిల్‌ను మాత్రమే కాదు డ్రగ్స్‌కి సంబంధించిన ఎలాంటి అంశాలున్నా కూడా సినిమా ఆడదని నార్కోటిక్స్ బృందం నోటీసుల్లో పేర్కొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యాక్షన్ డ్రామాగా గాంజా శంకర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కొన్ని రోజుల క్రితమే గాంజా శంకర్ టైటిల్‌ను రిలీజ్ చేసింది. అప్పుడే అందరికీ అర్థమైపోయింది ఇది డ్రగ్స్‌కి సంబంధించిన సినిమా అని. ఎవరో ఒకరి నుంచి ఏదో ఒక అభ్యంతరం వ్యక్తం అవుతుందని ఊహాగానాలు ముందూ ఊపందుకున్నాయి. ఊహించినట్లుగానే నార్కోటిక్స్ బృందం కన్ను గాంజా శంకర్‌పై పడింది.
ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వీక్షించారు. ట్రైలర్‌లో హీరో ఆకుకూరల బిజినెస్ చేసుకుంటున్నట్లు చూపించారని.. ఆ ఆకుకూరల బిజినెస్ ద్వారానే గంజాయి గురించి వివరించేలా సినిమా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దయచేసి తమ నిబంధనలను పాటించి నోటీసుల్లో పేర్కొన్న మార్పులు చేస్తే బాగుంటుందని సందీప్ శాండిల్య గాంజా శంకర్ టీంను రిక్వెస్ట్ చేసారు.
నేను గాంజా శంకర్ ట్రైలర్ చూసాను. అందులో ప్రధాన పాత్రలో నటించిన వ్యక్తి ఆకుకూరల బిజినెస్ చేసుకుంటున్నట్లు కనిపించారు. ట్రైలర్‌లో అక్కడక్కడా గంజాయి మొక్కలను కూడా చూపించారు. అంటే కచ్చితంగా అతను సినిమాలో డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటాడని అనిపించింది. కొన్ని నిబంధనల ప్రకారం ఎవ్వరూ కూడా డ్రగ్స్‌కి సంబంధించిన మొక్కలను పెంచడం కానీ దాచడం కానీ ఇతర నార్కోటిక్ డ్రగ్స్‌లో ఉపయోగించడం కానీ నేరం. సినిమాల ప్రభావం సమాజంపై ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లపై సినిమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. సినిమాల్లో చూపించిన అంశాలకు త్వరగా ఎట్రాక్ట్ అవుతారు. అలాంటప్పుడు సినిమాలను చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఎలాంటి సన్నివేశాలు చూపించాలో చూపించకూడదో అవగాహన కలిగి ఉండాలి. గాంజా శంకర్ సినిమాలో హీరోయిజాన్ని చూపించడానికి డ్రగ్స్‌కి సంబంధించిన సన్నివేశాలు చూపించకండి. యువత జీవితాల గురించి ఆలోచించండి. సినిమా టైటిల్‌లోనే గాంజా అని పెట్టేసారు. ఇది చాలా తప్పు. టైటిల్ మార్చకపోతే కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వార్నింగ్ ఇచ్చారు.
సాయి ధరమ్ తేజ్‌తో పాటు నిర్మాత నాగ వంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు పంపించారు. నోటీసుల కాపీలను TFPC (తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్), TFDA (తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్), మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు కూడా పంపారు.
మేనమామ పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) బ్రో (BRO) సినిమాలో నటించిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు గాంజా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత సంపత్ నంది ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు.