Raj-Koti: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్​ కన్నుమూత!

Hyderabad: టాలీవుడ్ లో రాజ్-కోటి(Raj- Koti) ద్వయం ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించి కొన్నేళ్లపాటు పాపులర్​ సంగీత దర్శకులుగా రాణించారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు సూపర్​ హిట్​లుగా నిలిచాయి. కాగా రాజ్- కోటి ద్వయంలో రాజ్(Raj) ఈ రోజు (ఆదివారం) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ మరణంతో మ్యూజిక్ లవర్స్ విషాదంలో మునిగిపోయారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. అలనాటి సంగీత దర్శకుడు టివి రాజు కుమారుడే రాజ్.

కోటి తో కలిసి 450 చిత్రాలకి మ్యూజిక్ అందించిన రాజ్.. లంకేశ్వరుడు, యముడికి మొగుడు, హలొ బ్రదర్, బంగారు బుల్లోడు లాంటి ఎన్నో హిట్ ఆల్బమ్స్ కి కోటితో కలిసి పని చేసారు. కొన్నేళ్లుగా రాజ్-కోటి కలిసి పని చెయ్యడం లేదు. ఆ తర్వాత రాజ్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్స్ లో అఖిల్ సిసింద్రి మాత్రమే హిట్ ఆల్బమ్ గా నిలిచింది. 24 సినిమాలకు కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే అందించి అలరించారు రాజ్. రాజ్ అంటే నేటి తరానికి తెలియకపోవచ్చు. అయితే రాజ్ – కోటి పేరు చెబితే మాత్రం తప్పక గుర్తు పడతారు. కాగా, రాజ్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు రాజ్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.