Indian 2: కమల్​ మూవీలో సిద్ధార్థ్​​!

Chennai: కోలీవుడ్​ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) డైరెక్ట్ చేస్తున్న మోస్ట్​ అవెయిట్​ మూవీ ‘ఇండియన్-2’(Indian2). ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Hasan) వైవిధ్యమైన పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. గతంలో వచ్చిన ‘భారతీయుడు(Bharateeyudu)’ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో, సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఈమేరకు సిద్దార్థ్​ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేసింది. విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సిద్ధార్థ్(Siddharth) ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇండియన్-2 సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal agarwal)తో పాటు, రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంకా విడుదల తేదీ ఖరారు చేయని ఈ సినిమాకోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.