Mahesh Babu: మహేష్ షరతు.. జవదాటని నమ్రత
Mahesh Babu: టాలీవుడ్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు.. నమ్రత శిరోద్కర్‌ల (Namrata Shirodkar) జంటను పవర్ కపుల్ అని అంటుంటారు. ఇద్దరు పిల్లలతో వారి కుటుంబం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. ప్రతి సినిమా ఇంటర్వ్యూలో మహేష్ నమ్రత గురించి ప్రస్తావించకుండా మాత్రం ఉండలేరు. అంత ప్రాణం మహేష్‌కి నమ్రత అంటే. అఫ్కోర్స్ నమ్రతకు కూడా మహేష్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి.
2000లో వచ్చిన వంశీ సినిమా సమయంలో తొలిసారి మహేష్, నమ్రత కలుసుకున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఇద్దరూ న్యూజిలాండ్ వెళ్లారు. ఆ సమయంలోనే వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వంశీ సినిమా రిలీజ్ అయ్యాక ఐదేళ్ల పాటు తమ ప్రేమ బంధాన్ని రహస్యంగా కొనసాగించారు. అయితే ఇంట్లో విషయం తెలిసాక వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. ఇందుకు కారణం మహేష్ బాబు ప్రేమించిన అమ్మాయి హీరోయిన్ కావడం. పైగా తెలుగు హీరోయిన్ కాకపోవడం మరో మైనస్ పాయింట్‌గా మారింది.
అక్క సాయంతో..
మహేష్ నమ్రతను పెళ్లి చేసుకోవడానికి తన అక్క మంజుల (Manjula Ghattamaneni) సాయం తీసుకున్నారట. నాన్న ఒప్పుకోవడం లేదు కాస్త మాట్లాడి ఒప్పిస్తావా అని రిక్వెస్ట్ చేసారట. తమ్ముడి ప్రేమను అర్థంచేసుకున్న మంజుల మెల్లిగా ఇంట్లోవారిని ఒప్పించి చివరికి తన తండ్రి కృష్ణను అతి కష్టం మీద ఒప్పించారట. అలా 2005 ఫిబ్రవరి 10న మహేష్, నమ్రతల వివాహం కుటుంబ సభ్యుల నడుమ చెన్నైలో ఘనంగా జరిగింది. వీరి వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారమే జరిగింది. ఏ రోజైతే నమ్రత మహేష్‌ను పెళ్లి చేసుకున్నారో ఆమె తెలుగు ఆడపడుచులాగే మారిపోయారు. 2006 ఆగస్ట్‌లో నమ్రత, మహేష్‌లు మగపిల్లాడికి జన్మనిచ్చారు. అతనే గౌతమ్ ఘట్టమనేని. ఆ తర్వాత ఆరేళ్లకు సితార పుట్టింది.
పెళ్లి తర్వాత నమ్రత మహేష్ కోసం సినిమాలు మానేసారు. సినిమాలు చేయాల్సిన అవసరం లేదని హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటే చాలని మహేష్ అనడంతో నమ్రత తన భర్త మాటను గౌరవించి ఓ మంచి కుటుంబాన్ని తయారుచేసుకున్నారు. మహేష్ నమ్రతో ఇలా చెప్పడానికి ఒక కారణం ఉంది. మహేష్ ఎటూ సినిమాలతో బిజీగా ఉంటారు. షూటింగ్‌ల కారణంగా వివిధ ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
పిల్లలు పుట్టాక నమ్రత కూడా సినిమాలు కొనసాగిస్తే పిల్లలు తల్లిదండ్రులను మిస్సవుతున్నాం అని ఫీల్ అవుతారేమోనని మహేష్ నమ్రతను సినిమాలు మానేయమని చెప్పారు. ఈ విషయాన్ని ముందు నమ్రత ఓ సందర్భంలో చెప్పినప్పుడు చాలా మంది మహేష్‌ను ఆడిపోసుకున్నారు. భార్య ఇంటి పట్టునే ఉండాలి ఇంటి పనులు చేయాలి అనే మహేష్ ఆలోచనా విధానాన్ని తప్పుబడుతూ బ్యాడ్ కామెంట్స్ చేసారు. సినిమాలే కాదు సాధారణ ఆఫీస్ వర్క్ చేస్తున్నా కూడా మహేష్ వద్దనే వారని ఇంటి పట్టునుండే భార్య కావాలని మహేష్ ముందే ఓ కండీషన్ పెట్టారని అన్నారు. అయినా నమ్రతకు లేని బాధ ఈ నెటిజన్లకేంటో..!