Laal Salaam: కూతుళ్లు దిద్దిన డిజాస్టర్లు..!
Laal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్.. (Rajinikanth) తన 50 ఏళ్ల కెరీర్లో తొలిసారి డిజాస్టర్‌ను చవిచూసారు. ఆయన నటించిన లాల్ సలామ్ సినిమాకు ఎవ్వరూ సలామ్ కొట్టలేదు. దాంతో అది ఒక మూలన పడిపోయింది. జైలర్ (Jailer) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్‌కు లాల్ సలామ్ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ షాక్ బయటి డైరెక్టర్ ఇస్తే ఫర్వాలేదు. కానీ ఇంట్లో వారే ఇస్తే..? రజినీకాంత్ విషయంలో ఇదే జరిగింది. లాల్ సలామ్ సినిమాను తీసింది ఎవరో కాదు ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య (Aishwarya).
2012లో వచ్చిన 3 సినిమాతో ఐశ్వర్య ఇండస్ట్రీలోకి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె భర్త ధనుష్ (Dhanush), శృతి హాసన్ (Shruti Haasan) జంటగా నటించారు. పాటల వల్లే సినిమాకు విపరీతంగా హైప్ వచ్చింది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్. మొన్న రీ రిలీజ్ అయినప్పటికీ చాలా మంది కేవలం పాటల కోసమే థియేటర్లకు ఎగబడ్డారు. ఆ తర్వాత 2014లో వాయ్ రాజా వాయ్ అనే సినిమాను కూడా తీసారు. ఈ సినిమా తీసినట్లు రజినీకాంత్ కుటుంబ సభ్యులకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అంతలా సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఐశ్వర్య ఎలాంటి సినిమాను తీయలేదు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తన తండ్రిపై ప్రయోగం చేయాలనుకున్నారు. అలా లాల్ సలామ్ సినిమా పట్టాలెక్కింది.
రజినీకాంత్ నుంచి లాల్ సలామ్ అనే ఒక సినిమా వస్తోందని కేవలం తమిళనాడు ప్రజలకు మాత్రమే తెలుసు. అంతటి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు మరి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ఎంత డిసపాయింట్ అయ్యారో మాటల్లో వివరించలేం. సినిమా తీసింది ఆయన కూతురే కాబట్టి ఫ్యాన్స్ మింగలేక కక్కలేక మౌనంగా ఉండిపోయారు. తమిళనాడులో అయినా కలెక్షన్లు బాగానే వచ్చాయా అనుకుంటే అదీ లేదు. అక్కడ చాలా తక్కువ కలెక్షన్లు రాగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లో కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదట.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్ల నుంచి రెండో రోజే లాల్ సలామ్ సినిమాను తొలగించేసారు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తపెట్టుకోవాలి. లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించలేదు. జస్ట్ ఆయన కేమియో రోల్లో నటించారు. అది కూడా కూతురి కోసం ఒప్పుకున్నారు.
రెండో కూతురి నుంచి కూడా డిజాస్టరే..!
ఐశ్వర్య నుంచి ఒక్క హిట్ లేదు. సరే అని రెండో కూతురు సౌందర్యకు (Soundarya) ఒక అవకాశం ఇచ్చారు రజినీకాంత్. అలా 2014లో కొచ్చాడయాన్ అనే సినిమాను సౌందర్య తెరకెక్కించారు. దీనిని ఒక యానిమేటెడ్ చిత్రంగా తీసారు. రిలీజ్ అయ్యాక కలెక్షన్లు చూసి సౌందర్యను అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇక లాల్ సలామ్ డిజాస్టర్ అవ్వడంతో రజినీకాంత్ తన కూతుళ్లను వేరే కెరీర్ పరంగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని వారు డైరెక్షన్ ఫీల్డ్‌కు పనికిరారని సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ వారు డైరెక్షన్ ఫీల్డ్‌లోనే ఉండాలనుకుంటే వారి సినిమాల్లో రిజినీకాంత్ నటించకపోవడమే ఉత్తమం అని కామెంట్స్ పెడుతున్నారు.