Kamal Haasan: OTT వస్తుందని అప్పుడే చెప్పా!
Abudhabi: ప్రతిష్టాత్మక ఐఫా(IIFA) ఉత్సవాల్లో లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Hasaan) అరుదైన గౌరవం అందుకున్నారు. అబుదాబిలో జరిగిన ఈ ఫిలిం ఫెస్టివెల్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడిన కమల్ పలు విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఓటీటీ(OTT) గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాక గురించి ఇతరుల కంటే ముందే చెప్పాను. ఓ ప్లాన్ తో ముందుకు వచ్చాను. కానీ అప్పుడు సినిమా పరిశ్రమ నా ప్రకటనను అంగీకరించలేదు. నేను ఏమి చెప్పాలనుకున్నానో అందరికీ ఈ రోజు అర్థమైంది. ఇప్పుడు, భారతీయ అభిమానులు.. అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. మీకు సాహిత్యంలో M.A. పట్టా ఉందనుకుందాం, ఒక్కటే మిమ్మల్ని గొప్ప స్క్రీన్‌రైటర్‌గా మార్చదు. ఇది వేరే కళ. ఇప్పుడు షేక్స్పియర్ అయినా, స్క్రీన్‌ప్లేలు రాయడానికి కొన్ని వర్క్‌షాప్‌లకు హాజరు కావాలి’ అన్నారు కమల్.
2013లో కమల్ హాసన్ దర్శకత్వం వహించి, నటించి పెద్ద వివాదాల మధ్య విడుదలైన చిత్రం ‘విశ్వరూపం’. అప్పట్లో సినీ పరిశ్రమలో ఎవరూ ఊహించని ప్లాన్‌తో కమల్‌హాసన్ ముందుకొచ్చారు. డైరెక్ట్-టు-హోమ్ ప్రోగ్రామ్ ద్వారా డిష్ టీవీలో ఇంట్లోనే ‘విశ్వరూపం’ చూడవచ్చు. నేరుగా డబ్బులు చెల్లించి ఇంట్లోనే చూసేలా ప్లాన్ చేశారు. కానీ థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రాజెక్టును వదిలేశారు. దీనిపై తాజాగా కమల్ ఈ విధంగా స్పందించారు.