Kalki 2898 AD Review: ప్రభాస్ కల్కి రివ్యూ
Kalki 2898 AD Review: నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడి ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత సలార్‌తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ప్రభాస్.. కల్కి సినిమాతో మరిన్ని రికార్డులు బద్దలకొడతారని చాలా మంది అనుకున్నారు. సినిమాలో బుజ్జి అనే వాహనాన్ని తీసుకురావడం.. దానిని ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా ఎక్కి ట్రై చేయడం వంటివి బాగానే సినిమాకు హైప్‌ని తీసుకొచ్చాయి. ఇక కల్కి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటి?
కల్కి సినిమా మొత్తం కాశి అనే ఊరు చుట్టూ తిరుగుతుంది. ఈ కాశి అనేది ప్రపంచం మొత్తంలో కాస్త పచ్చదనంతో మిగిలి ఉన్న ఏకైక ఊరు. ఇక శాంబల అనే మరో నగరం ఉంటుంది. ఈ నగరంలో రెబెల్స్ ఉంటారు. శాంబలలోని ప్రజలు కల్కి పునర్జన్మిస్తాడని తమను శాంబల అధినేత యాస్కిన్ (కమల్ హాసన్) నుంచి కాపాడతాడని ఎదురుచూస్తుంటారు. భైరవ (ప్రభాస్) కాశీలో ఉంటాడు. మరోపక్క అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) కల్కిని గర్భంలో మోస్తున్న మహిళను కంటికి రెప్పలా కాపాడుతూ తనకు దక్కాల్సిన మోక్షం కోసం తపిస్తుంటాడు. ఇక యాస్కిన్ 120 రోజులుగా గర్భంతో ఉన్న మహిళ పిండం నుంచి సేకరించిన సీరమ్‌తో ఇంజెక్షన్ వేసుకుని సూపర్ పవర్స్ దక్కించుకోవాలని యత్నిస్తుంటాడు. మరి యాస్కిన్ గర్భిణి నుంచి ఆ సీరమ్‌ను దక్కించుకోగలిగాడా? అసలు భైరవ, అశ్వత్థామకు ఉన్న సంబంధం ఏంటి? వంటి అంశాలను తెరపై చూడాల్సిందే.
ఎలా నటించారు?
సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు ఉన్నారు. ప్రభాస్ భైరవ పాత్రలో సినిమాను తన భుజాలపై నడిపించాడనే చెప్పాలి. సినిమాలో ప్రభాస్ వేసుకునే సూట్ ఆయనకు బాగా సూట్ అయ్యిందనే చెప్పాలి. ప్రభాస్ తర్వాత ఆ రేంజ్‌లో మంచి పాత్ర దక్కింది దీపిక పదుకొణెకే. తన హావభావాలతో అక్కడక్కడా భావోద్వేగపు సన్నివేశాలను బాగా పండించింది. ఇక అమితాబ్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సినిమాకు ఆయనే స్టార్ అని చెప్పాలి. CGI ద్వారా తీర్చి దిద్దిన యాస్కిన్ (కమల్ హాసన్) లుక్ అదిరిపోయింది.
ఇక కమల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే అదరగొట్టేసారు. ఇక శోభన, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారు. బ్రహ్మానందం, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ అంతగా పండలేదు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో 2 నిమిషాల పాటు కనిపిస్తాడు. దిశా పటానీకి మంచి పాత్ర పడినప్పటికీ ఆమె త మార్క్ చూపించలేకపోయింది.
మొత్తానికి సినిమా ఎలా ఉంది?
మహాభారతాన్ని తనదైన శైలిలో కాస్త డిఫరెంట్‌గా చూపించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రయత్నించారు. మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్లు దైవ సంబంధిత పాత్రలుగా చూపిస్తే జనాలకు బోర్ కొడుతుందని కాస్త మ్యాడ్ మ్యాక్స్, స్టార్ వార్స్ వంటి సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసాడు అనిపిస్తుంది. సినిమా కాస్త నిదానంగానే మొదలవుతుంది. మొత్తం సినిమా ఉన్నది సెకండాఫ్‌లోనే. మొత్తానికి నాగ్ అశ్విన్ తాను మనసులో అనుకున్నది తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్, బీజీఎం ఇంకాస్త బాగుండాల్సింది. CGI మాత్రం హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి కల్కి సినిమా ప్రభాస్ అభిమానులకు, సైఫై సినిమా లవర్స్‌కి బాగా నచ్చుతుంది.