నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే…!
Hyderabad: జూనియర్ ఎన్టీఆర్(NTR)–కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NTR30 సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోన్న అందాల భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor). ఆర్ఆర్‌ఆర్(RRR) వంటి భారీ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్లను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయగా.. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) చేస్తున్నారు.
ఇక, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ తాను నటి కాకపోయుంటే ఏమయ్యేదో, తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలేంటో.. వంటి పలు విషయాలు పంచుకుంది. ‘నాకు రోమింగ్ అంటే ఇష్టం. హీరోయిన్ కాకపోయుంటే ఒక ప్రాంతంలో ఉండిపోకుండా, తిరుగుతూ ప్రపంచాన్ని చుట్టేసే దానిని, పుస్తకాలు రాసేదాన్ని. కొత్త వ్యక్తుల్ని కలవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాను’ అంటూ తన అభిరుచులు పంచుకుంది. ఇక చేసుకోబోయేవాడిలో ఉండే లక్షణాల గురించి మాట్లాడుతూ..‘మంచి టాలెంటెడ్ వ్యక్తి అయ్యుండాలి. కామెడీ బాగా చేసి ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉండాలి. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూ.. నన్ను ఉత్సాహంగా ఉంచేవాడు, నాతో, నా ఆలోచనలతో బాగా కలిసిపోయేవాడు భర్తగా కావాలి’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.