సునీల్ స్థానాన్ని భర్తీ చేసేది అతనేనా?
కమెడియన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన నటుడు సునీల్. తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కమెడియన్‌గా సునీల్ ఓ వెలుగు వెలిగారు. ఆకట్టుకునే హావభావాలు, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నేళ్లపాటు టాలీవుడ్లో విడుదలైన ప్రతి సినిమాలోనూ హీరో ఫ్రెండ్‌గా ఉంటూనే నవ్వులు పూయించారు. సహనటుడు నుంచి పనోడు వరకు సునీల్ నటించని పాత్ర లేదు. అయితే అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్ ఆ తర్వాత హాస్యానికి దూరమై అభిమానులను నిరాశ పరిచారు. హీరోగా పూలరంగడు, మర్యాద రామన్న, పెళ్లికొడుకు వంటి సినిమాలతో కొన్నాళ్లపాటు అలరించినా తర్వాత మాత్రం సునీల్ నటించిన సినిమాలు డిజాస్టర్లుగా మిగలిపోయాయి. కొన్నాళ్లపాటు సందిగ్ధంలో ఉన్న సునీల్ మళ్లీ కామెడీ పాత్రలపై దృష్టిపెట్టారు. కమెడియన్‌గానే కాకుండా హీరోగా రాణించి మళ్లీ విలన్‌గానూ రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
అయితే ఇండస్ట్రీలో సునీల్ ప్లేస్ ఖాళీ అయిన తర్వాత మళ్లీ ఆ స్థానంలోకి ఎవరూ రాలేదు. కేవలం కామెడీతోనే అయితే పర్లేదు కానీ హీరోగానూ సునీల్ సత్తా చూపించారు. మరి ఇప్పుడు ఆ ప్లేస్‌పై కన్నేసిన కమెడియన్ ఎవరు.. నవ్వుతో పాటు హీరోయిజం కూడా పండించే ఆ నటుడెవరంటే.. తాజాగా వినిపిస్తున్న పేరు ప్రియదర్శి.
కమెడియన్‌గా ఇండస్ట్రీకి వచ్చినా హీరోగానూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు ప్రియదర్శి. ముఖ్యంగా నాలుగేళ్ల కింద వచ్చిన మల్లేశం సినిమాతో నటుడిగా తనదైన ముద్ర వేసిన దర్శి, ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాలో నవీన్ పొలిశెట్టితో కలిసి కడుపుబ్బా నవ్వించారు. ఇక, ఇటీవలే విడుదలైన బలగం సినిమాతో ప్రియదర్శి రేంజ్ మరింత పెరిగిపోయింది. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి తెరకెక్కించిన ఈ చిత్రంలో కేవలం కామెడీతోనే కాదు ఎమోషనల్గానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశంలో తన నటనతో కన్నీరు పెట్టించారు. బలగం తర్వాత ప్రియదర్శికి హీరోగానూ చాలా అవకాశాలు వస్తున్నాయి. అలాగే రెమ్యునరేషన్ రేంజ్ కూడా పెరిగిందని తెలుస్తుంది.
సునీల్ ప్లేస్‌లోకి రావడం అంటే అంత ఈజీ కాదు. హీరోగా తన మార్కెట్ పడిపోయిందని తెలిసాక మళ్లీ రూట్ మార్చేసి కమెడియన్‌గానే కాకుండా, విలన్‌గానూ రప్ఫాడిస్తున్నారు సునీల్. కానీ ప్రియదర్శి మాత్రం కేవలం కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ సత్తా చూపించాలని చూస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. సునీల్ స్థానాన్ని భర్తీ చేయగలిగితే టాలీవుడ్‌కి మరో కామెడీ హీరో దొరికినట్టే.