Krrish 4: సూపర్ హీరో సిరీస్‌లో నెక్ట్స్ పార్ట్.. ఎప్పుడంటే..!
Hyderabad: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) క్రిష్(Krrish) సినిమాతో ఇండియన్ సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 2006 లో రిలీజైన క్రిష్ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా 2003లో హృతిక్ నటించిన ‘కోయీ మిల్ గయా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. ‘కోయీ మిల్ గయా’లో ప్రీతీ జింటా (Preity Zinta) హీరోయిన్ గా నటించగా క్రిష్ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హృతిక్ కి జోడిగా కనిపించింది.
ఈ సినిమా సీక్వెల్‌గా 2013 లో క్రిష్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సూపర్ హీరో సిరీస్ లో నెక్ట్స్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా క్రిష్ 4 పట్టాలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ ప్రస్తుతం ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత వార్ 2 (War 2) సినిమా పూర్తి చెయ్యాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తరువాత వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో క్రిష్ 4 మొదలు కానుందట.
కాగా కోయీ మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్.. రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అయితే ఈసారి దర్శకత్వ బాధ్యతలు కరణ్ మల్హోత్రా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో హృతిక్ హీరోగా వచ్చిన అగ్నిపథ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మరి క్రిష్4తో ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.