Gunasekhar: నాకు అన్యాయం జ‌రిగితే ఊరుకోను

Hyderabad:  త‌న‌కు అన్యాయం చేయాల‌ని చూస్తే ఎవ‌రినైనా స‌రే వ‌దిలేది లేదని అంటున్నారు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ (gunasekhar). ఆయ‌న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (trivikram srinivas), రానా ద‌గ్గుబాటిల (rana daggubati) గురించి ప్ర‌స్తావిస్తూ త‌న బాధ‌ను వ్య‌క్తం చేసారు. గ‌తంలో గుణ‌శేఖ‌ర్.. రానాతో హిర‌ణ్య క‌శ్య‌ప (hiranya kashyap) సినిమా తీయాల‌నుకున్నారు. ఇందుకోసం గుణ‌శేఖ‌ర్.. త్రివిక్ర‌మ్‌ను అప్రోచ్ అయ్యారు. త్రివిక్ర‌మ్‌కి స్టోరీ న‌చ్చి డైలాగ్స్ రాస్తాన‌ని చెప్పార‌ట‌. అయితే ఇంత‌కాలం త‌ర్వాత ఇప్పుడు గుణ‌శేఖ‌ర్‌కు క‌నీసం చెప్ప‌కుండా త్రివిక్ర‌మ్, రానా క‌లిసి హిర‌ణ్య క‌శ్య‌ప తీయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యం గుణ‌శేఖ‌ర్‌కు తెలీడంతో ఆయ‌న మండిప‌డుతున్నారు.

“” నాలో కోపం అనే న‌రం ఏమాత్రం తెగ‌లేదు. మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ న‌డిచేదే ప్రొఫెష‌న‌ల్ విలువ‌ల‌పై. ఆ విలువ పోగొట్టుకుంటే మ‌నం ఏమీ చేయ‌లేం. నేను హిర‌ణ్య క‌శ్య‌ప క‌థ రాసుకుని త్రివిక్ర‌మ్‌ని సంప్ర‌దించాను. త‌నే నాతో జాయిన్‌ అయ్యారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో నా టీం నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన‌వారు వెళ్లిపోకుండా నా క‌థ‌నే నేను అనుకున్న హీరోతోనే తీయాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. నాకు అన్యాయం చేయాల‌ని ఎవరు చూసినా నేను అస్స‌లు వ‌దిలిపెట్ట‌ను. కావాలంటే ఇలాంటి క‌థ‌తోనే ఇంకో సినిమా తీసుకోమ‌నండి నాకేం అభ్యంత‌రం లేదు. అంతేకానీ నేను రాసుకున్న స్టోరీని తీయాల‌ని అనుకోకండి. త్రివిక్ర‌మ్, రానాలు మ‌రీ ఇంత దిగ‌జారి ఆలోచిస్తార‌ని నేనైతే అనుకోవ‌డంలేదు. దేవుడి కాన్సెప్ట్‌ను తీసుకుని సినిమా తీయాల‌ని అనుకున్న‌ప్పుడు ఒక విష‌యం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన స‌మ‌గ్ర‌త‌పై కూడా ఓ క‌న్నేసి ఉంచుతాడు. అన్యాయాల‌ను దేవుడు న్యాయంగానే ఎదిరిస్తాడు “” అని తెలిపారు. (gunasekhar)